బాలుడి చేతిలో యువకుడి దారుణ హత్య
మేడ్చల్‌రూరల్: మద్యానికి బానిసైన ఓ యవకుడు తన కుటుంబ సభ్యులను వేధిస్తుండటంతో ఆగ్రహానికి లోనైన ఓ బాలుడు తన మేనత్త కొడుకు(బావ)ను దారుణంగా హత్య చేసిన సంఘటన సోమవారం మేడ్చల్ పట్టణంలో చోటు చేసుకుంది. మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ పట్టణం, రాఘవేంద్రనగర్ కాలనీలో రాధ తన తండ్రి జంగయ్య, ఇద్దరు కుమారులు శ్రీనివాస్, వెంకటరమణ(30), తమ్ముడి కుమారుడి(16)తో కలిసి నివాసం ఉంటోంది. వెంకటరమణ కిష్టాపూర్, అర్చన కాలనీ శివాలయంలో పూజారిగా పని చేసేవాడు. కొంత కాలంగా మద్యానికి బానిసై అర్చక వృత్తిని వదిలేసిన అతను కుటుంబ సభ్యులను వేధించేవాడు. ఐదు రోజుల క్రితం రాధ, తండ్రి జంగయ్యతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లగా, ఇంట్లో వెంకటరమణ ,అతని బావమరిది అయిన మైనర్ బాలుడు ఉన్నారు. ఆదివారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే అప్పటికే అతడి వైఖరితో విసిగిపోయిన బాలుడు వెంకటరమణను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి నిద్రిస్తున్న వెంకటరమణను కత్తితో గొంతు నరికి హత్య చేశాడు. సోమవారం ఉదయం మృతుడి సోదరుడికి ఫోన్ చేసి వెంకటరమణ మృతి చెందినట్లు చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మైనర్ బాలుడే హత్యకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment