ఫిలింనగర్: నకిలీ సర్టిఫికెట్ల విక్రయ ముఠా గుట్టును ఫిలింనగర్ పోలీసులు బట్టబయలు చేశారు.పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌కు చెందిన వజాహత్ అలీ (27) టోలిచౌకీలో నివాసం ఉంటున్నాడు. అతను అవసరమైన వారికి నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అతడిపై నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి షేక్‌పేట నాలా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వజాహత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు భారీగా నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు.
విదేశాలకు వెళ్లే వారే టార్గెట్..
దుబాయ్, కువైట్, మస్కట్, సౌదీ ఆరేబియా, బెహ్రైన్, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వెళ్లే యువకులు అందుకు అవసరమైన సర్టిఫికెట్ల కోసం వజాహత్‌ను సంప్రదించేవారు. దీంతో అతను తనకు పరిచయస్తుడైన రఫీవుల్లాతో సంప్రదింపులు జరిపి సర్టిఫికెట్లు అవసరమైన వారి సమాచారం, యూనివర్సిటీ వివరాలు అందజేసేవాడు. వాటిని రఫీవుల్లా మలక్‌పేటలోని ఫ్లై అబ్రాడ్ కన్సల్టెన్సీలో పని చేసే హబీబ్‌కు అందజేసేవాడు. హబీబ్ వాటిని ఖాన్‌పూర్‌కు పంపడంతో అక్కడ ఉన్న నకిలీ సర్టిఫికెట్ల తయారీదారు సదరు వివరాలతో అవసరమైన యూనివర్సిటీ సర్టిఫికెట్లను ముద్రించి కొరియర్‌లో నగరానికి పంపేవాడు. ఇందుకు గాను ఒక్కో సర్టిఫికెట్‌కు వజాహత్ రూ.80 వేల వరకు వసూలు చేసేవాడు. అందులో రూ.10 వేలు కమీషన్ తీసుకుని మిగతా రూ.70 వేలు రఫీవుల్లాకు అందజేసేవాడు. రఫీవుల్లా రూ.10 వేలు కమీషన్ తీసుకుని రూ.60 వేలు హబీబ్‌కు ఇస్తే, అతను రూ.20 వేలు మినహాయించుకుని రూ.40 వేలు ఖాన్‌ఫూర్‌లో ఉంటున్న నకిలీ సర్టిఫికెట్ల తయారీదారుడికి ఇచ్చేవాడు. ఈ తరహాలో వీరు ఆంధ్రా యూనివర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, సింబియాసిస్ యూనివర్సిటీ తదితర 20 ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన సర్టిఫికెట్లను అచ్చు గుద్దినట్లు తయారుచేసి విక్రయిస్తున్నట్లుగా విచారణలో వెల్లడైంది. నిందితుడు వజాహత్‌ను అరెస్టు చేసిన పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడి రిమాండ్
భారీగా సర్టిఫికెట్ల స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment