కలగానే బస్టాండ్!
కడ్తాల్: మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణం ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. బస్ షెల్టర్లు ఒక చోట ఉండగా.. బస్సులు మరో చోటు నిలుపుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రధాన రహదారి పక్కన లయన్స్‌క్లబ్ వారు ఏర్పాటు చేసిన చిన్న బస్‌షెల్టర్ ఉండేది. పదిహేను సంవత్సరాలుగా ప్రయాణికులను ఎండా, వానల నుంచి రక్షించింది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా దీన్ని కూల్చేయడంతో ప్రస్తుతం నిలువ నీడ లేకుండా పోయింది. రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు రెండు చోట్ల బస్ షెల్టర్లు ఏర్పాటు చేసినా, బస్సులను ఇక్కడ నిలపడం లేదు. దీంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. వాణిజ్య, వ్యాపారపరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతానికి నిత్యం అనేక మంది వచ్చివెళ్తున్నారు. ఇలాంటి వారికి సేదతీరేందుకు కనీసం నీడ కూడా కరువైంది. గతంలో రోడ్డు విస్తరణ చేపట్టక ముందు, బస్సుల కోసం వేచి ఉండటానికి ప్రధాన రహదారి పక్కన కనీసం చెట్లయినా ఉండేవి. పనుల్లో భాగంగా వీటిని తొలగించడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఎండ, దుమ్ములో బస్సుల కోసం నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా కడ్తాల్ గ్రామంలో రెండు కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రోడ్డును నిర్మించారు.
నిత్యం రద్దీ
మండల కేంద్రం మీదుగా నిత్యం వందలాది బస్సులు తిరుగుతుంటాయి. వీటిని బస్ షెల్టర్ల వద్ద కాకుండా రోడ్డు పక్కనే నిలపడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు గంటల తరబడి రోడ్డు పక్కన నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. దుకాణ సముదాయల ఎదుట నిలబడితే యజమానుల నుంచి ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు.సంబంధిత అధికారులు స్పందించి ప్రజలకు అవసరమైన చోట బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
కడ్తాల్‌లో నిలువ నీడ కరువు
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, విద్యార్థులు
రోడ్డుపైనే వాహనాల నిలుపుదల
తరుచూ ట్రాఫిక్ సమస్యలు
Comments
Please login to add a commentAdd a comment