కాంగ్రెస్, బీజేపీని నమ్మే పరిస్థితి లేదు
యాచారం: రాష్ట్రంలో కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, కాంగ్రెస్, బీజేపీలను నమ్మే పరిస్థితి లేదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. నందివనపర్తి మాజీ సర్పంచ్ వర్థ్యావత్ రాజునాయక్ తల్లి రూప్లీబాయి మొదటి వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన బొల్లిగుట్టతండాకు చేరుకుని ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం నందివనపర్తిలో విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ప్రజల మెప్పు పొందలేదన్నారు. హామీల అమలులో ప్రభుత్వం చతికిల పడిందని ఎద్దేవా చేశారు.
కులగణనలో అలసత్వం వహించొద్దు
చాదర్‌ఘాట్: కులగణన సర్వేలో ఎన్యుమరేటర్లు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని డీసీ జయంత్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వే రెండో దఫాలో మలక్‌పేట్ సర్కిల్‌లో 5307 కుటుంబాల సర్వే చేయాల్సి ఉందన్నారు. గత మూడు రోజుల నుంచి దాదాపు 972 కుటుంబాల వివరాలు సేకరించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోని పూర్తిస్థాయిలో సర్వే చేస్తామన్నారు.
మలక్‌పేట్‌లో అధికారులపై విజిలెన్స్ విచారణ
చాదర్‌ఘాట్: మలక్‌పేట్ సర్కిల్–6లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులపై గత నెల రోజుల నుంచి విచారణ పేరుతో హడావుడి నెలకొంది. టౌన్‌ప్లానింగ్ ఏసీపీ అధికారిపై అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే స్పందించడం లేదని పలువురు మలక్‌పేట్ నుంచి హైదరాబాద్ గ్రేటర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే సంబందిత అధికారికి ఫోన్‌చేసి ఏసీపీకి మెమోతో పాటు విచారణ చేయాల్సిందిగా డీసీకి ఆదేశాలు ఇచ్చారు. శానిటేషన్ సూపర్‌వైజర్ అధికారిపై ట్రేడ్ లైసెన్స్ జారీ చేయడంలో అవినీతి జరిగిందని పలువురు ఫిర్యాదులు చేయడంపై కమిషన్ విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చారని అధికారులు వెల్లడించారు.
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
చాదర్‌ఘాట్: కుటుంబ కలహాలతో ఉరేసుకుని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చాదర్‌ఘాట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై భరత్‌కుమార్ వివరాల ప్రకారం.. ఓల్డ్‌మలక్‌పేట్‌లోని వాహెద్‌నగర్‌కు చెందిన సయ్యద్ ఆజమ్(43), సబాబేగం దంపతులు. వీరికి నలుగురు సంతానం. గత కొన్ని రోజులుగా ఇరువురి నడుమ వివాదం జరుగుతోంది. మనస్తాపానికి గురైన సయ్యద్ ఆజమ మంగళవారం ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని మృతి చెందాడు.
క్యాట్ ఒలింపియాడ్ పరీక్షలో ప్రతిభ
చైతన్యపురి: ఇటీవల నిర్వహించిన క్యాట్ ఒలింపియాడ్ పరీక్షల్లో వీవీనగర్‌లోని పాణినీయ మహా విద్యాలయ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ ఉషారాణి తెలిపారు. 6–10 తరగతుల 73 మంది విద్యార్థులు పాల్గొనగా 11 మంది ప్రైజ్‌మనీ, 38 మంది మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు సాధించారన్నారు. మంగళవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, నాగేశ్వరరావు,జ్యోతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment