దేవరయాంజాల్‌లో ప్రహరీ తొలగించిన హైడ్రా
సాక్షి, సిటీబ్యూరో: ఓ కాలనీ వెంచర్ నిర్వాహకులు దళితవాడకు వెళ్లే దారిని మూసేశారు. దీనిపై బాధితుడు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని (హైడ్రా) ఆశ్రయించారు. దీని పూర్వాపరాలు పరిశీలించిన అధికారులు బుధవారం ప్రహరీ తొలగించి, దళితవాడకు సంబంధించిన దారిని పునరుద్ధరించారు. శామీర్‌పేట్ మండలం తూంకుంట మున్సిపాలిటీలోని దేవరయాంజాల్‌లో ఇది చోటు చేసుకుంది. ఒకప్పుడు ఈ దళితవాడకు వెళ్లేందుకు నలువైపుల నుంచి దారి ఉండేది. అక్కడ 1985లో తిరుమల కాలనీ పేరుతో ఓ వెంచర్ వచ్చింది. వీరు ఆ దారులు మూసేయడంతో దళితవాడకు చెందిన వారంతా కేవలం చిన్న బాటకు పరిమితమయ్యారు. దీనిపై వాళ్లు గతంలో పలుమార్లు వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులను కలిసి విన్నవించినా ఫలితం దక్కలేదు. దీంతో ఈ నెల 17న హైడ్రా ప్రజావాణిలో కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. 2022 ఫిబ్రవరిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఆ కమిషన్ ఆదేశాలను హైడ్రా దృష్టికి తీసుకువెళ్లారు. తమ ప్రాంతానికి దారులు మూసుకుపోవడంతో కనీసం అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు కూడా రాలేని పరిస్థితి ఏర్పడిందని, తాము కూడా చుట్టూ తిరుగుతూ కేవలం ద్విచక్ర వాహనాలపై మాత్రమే రాకపోకలు సాగించగలుగుతున్నామని హైడ్రాకు విన్నవించారు. ఈ ఫిర్యాదుకు కీలక ప్రాధాన్యం ఇచ్చిన కమిషనర్ ఏవీ రంగనాథ్ నిబంధనలు, చట్టపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చివరకు ప్రహరీ తొలగించేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో హైడ్రా సిబ్బంది బుధవారం తిరుమల వెంచర్ నిర్మించిన ప్రహరీని కూల్చేశారు. దీంతో తమ వాడకు దారి దొరికిందని దళితవాడకు చెందిన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గర్భిణీ సీ్త్రలతో పాటు అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారిని తాము బయటకు మోసుకువచ్చి అంబులెన్సు ఎక్కించేవారమని, ఇప్పుడు దారులు తెరుచుకోవడంతో ఉపశమనం లభించినట్లు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment