పడమట పర్యాటక రాగం! | - | Sakshi
Sakshi News home page

పడమట పర్యాటక రాగం!

Published Mon, Mar 3 2025 6:40 AM | Last Updated on Mon, Mar 3 2025 6:44 AM

పడమట పర్యాటక రాగం!

పడమట పర్యాటక రాగం!

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేసే సరికొత్త ప్రాజెక్టు నిర్మాణానికి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చర్యలు చేపట్టింది. దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులను ఆకట్టుకొనేలా ప్రత్యేక టూరిస్ట్‌ సర్క్యూట్‌లకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ట్యాంక్‌బండ్‌, నెకె్‌ల్‌స్‌ రోడ్డు, పీపుల్స్‌ ప్లాజా వలయంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా వలయ రహదారి ఉన్నట్లుగానే పడమట వైపున సుమారు 31 కిలోమీటర్ల పరిధిలో ఒక సర్క్యూట్‌ను ఏర్పాటు చేయనున్నారు. సుమారు 180 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన ఎకో పార్కు, గాంధీజీ భారీ విగ్రహంతో పాటు పర్యాటకులు సందర్శించేలా అభివృద్ధి చేయనున్న బాపూఘాట్‌తో పాటు వివిధ ప్రాంతాలను ఈ వలయంలో రూపొందించనున్నారు. ఇందుకోసం మౌలిక వసతులు, రహదారుల విస్తరణ, ప్రత్యేక రవాణా సదుపాయాలను విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. ఎకో పార్కు నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు. చారిత్రక తారామతి బారాదరితో పాటు, హిమాయత్‌సాగర్‌ ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్కు తదితర ప్రాంతాలను ఈ వలయం అనుసంధానం చేయనుంది. పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ)పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. డిజైన్‌, నిర్మాణం, నిధుల కేటాయింపు, నిర్వహణ, బదిలీ (డీబీఎఫ్‌ఓటీ) మోడల్‌ గా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందుకోసం త్వరలోనే ఆసక్తుల వ్యక్తీకరణకు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ నోటిఫికేషన్‌ వెలువడనుందని పేర్కొన్నారు.

సర్క్యూట్‌లోని ప్రధాన ప్రాంతాలు..

● ఈ కొత్త టూరిజం సర్క్యూట్‌లో ఎకోపార్క్‌ (కొత్వాల్‌గూడ, హిమాయత్‌ సాగర్‌ సమీపంలో), బాపూ ఘాట్‌, తారామతి బారాదరి, ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్క్‌ (చిలుకూరు రిజర్వ్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌) వంటి నాలుగు ప్రధాన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. మొత్తం 31 కిలోమీటర్ల పొడవున ఈ సర్క్యూట్‌ విస్తరించనుంది.

● తారామతి బారాదరి నుంచి బాపూఘాట్‌కు 3.8 కిలో మీటర్లు, బాపూఘాట్‌ నుంచి ఎకోపార్కు (హిమాయత్‌సాగర్‌) 13.50 కి.మీ, హిమాయత్‌సాగర్‌ నుంచి ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్కు (నార్సింగి) వరకు 7.5 కి.మీ, అక్కడి నుంచి తిరిగి తారామతి బారాదరి వరకు 6 కి.మీ చొప్పున ఈ సర్క్యూట్‌ విస్తరించి ఉంటుంది.

పర్యాటకులను ఆకట్టుకునేలా..

ఈ సర్క్యూట్‌ను ఆధునిక పర్యాటక హంగులతో అభివృద్ధి చేయనున్నారు. దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేలా రవాణా సదుపాయాలను ఏర్పాటు చేస్తారు.

భాగ్య నగర చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించేలా సర్క్యూట్‌ను అందంగా తీర్చిదిద్దుతారు. రెస్టరెంట్‌లు, షాపింగ్‌ సెంటర్‌లు తదితర అన్ని సదుపాయాలూ ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటకులు వివిధ ప్రాంతాలను సందర్శించేవిధంగా ఏర్పాట్లు చేస్తారు.

పర్యాటక రంగం అభివృద్ధిని ప్రభుత్వం ప్రత్యేకంగా భావిస్తోంది. ఇప్పటికే మూసీ ప్రక్షాళనతో పాటు బాపూఘాట్‌ను సువిశాలమైన చారిత్రక సందర్శన స్థలంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈ క్రమంలో నగరాన్ని అన్ని రంగాలతో పాటు పర్యాటక రంగంలోనూ అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు ఇలాంటి సర్క్యూట్‌లు దోహదం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు.

ప్రత్యేకమైన పర్యాటక ప్యాకేజీలతో వెస్ట్‌ హైదరాబాద్‌ టూరిజం సర్క్యూట్‌ను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సందర్శించే విధంగా ప్రోత్సహిస్తారు.

‘ఈ సర్క్యూట్‌ పూర్తయితే నగర పర్యాటక రంగం కొత్త శోభను సంతరించుకుంటుంది. అందుకే దేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ఈ ప్రాజెక్ట్‌ అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం’ అని హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు వివరించారు.

టూరిస్ట్‌ ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక సర్క్యూట్‌

పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు

తారామతి బారాదరి, బాపూఘాట్‌, ఎకోపార్కు తదితర ప్రాంతాల అనుసంధానం

దేశ, విదేశీ సందర్శకులను ఆకట్టుకునేలా సదుపాయాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement