
రియాల్టీ.. పల్టీ!
స్థిరాస్తి వ్యాపారం మందగించింది. దీంతో రియల్టర్లు కష్టాల్లో కూరుకుపోయారు. తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తలలు పట్టుకున్నారు. కనీసం తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
షాబాద్: దశాబ్ద కాలానికి పైగా ఊపుఊపిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏడాది కాలంగా నెమ్మదించింది. క్రమంగా జోరు తగ్గి చతికిలబడిపోయింది. దీంతో రియల్టర్లు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. మహా నగరానికి కూతవేటు దూరంలో ఉన్న షాబాద్‌మండలంలో 2014లో అనేక పరిశ్రమలు కొలువుదీరాయి. దీంతో మండల రూపురేఖలు మారిపోయాయి. వెల్స్పన్, అమెజాన్, కుందన్, మెగా, కటేరా తదితర పరిశ్రమల ఆగమనంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో పెట్టుబడి దారులు భూముల కొనుగోలుకు ఉత్సాహం చూపారు. తొలుత లాభాలను గడించారు. అయితే 2023 ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అనంతరం వ్యాపారం తగ్గిపోయింది. దీనికి ఆర్థిక మాంద్యం తోడవడంతో పరిస్థితులు మారిపోయి.. రియాల్టీ రంగం కళతప్పింది.
కుదేలు.. కుంగదీత
ఏడాది క్రితం వరకు ఎగిసిపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆర్థిక మాంద్యం ప్రభావంతో కుదేలైంది. తదనంతర పరిణామాలు ప్రతికూల ప్రభావం చూపాయి. మండల పరిధి హైతాబాద్, చందనవెళ్లి, రుద్రారం, నాగర్‌గూడ, మాచన్‌పల్లి, నాగర్‌కుంట, నాంధార్‌ఖాన్‌పేట్, పేద్దవేడు, అంతిరెడ్డిగూడ గ్రామాల చుట్టుపక్కల ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే టీఎస్‌ఐఐసీలో పరిశ్రమల స్థాపన జరుగుతున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా మంది ఇక్కడి ప్రాంతాలపై ఆసక్తి చూపారు. అధిక లాభాలను ఆర్జించే ఉద్దేశంతో రూ. కోట్లు, లక్షలు పోసి, భూములను కొనుగోలు చేశారు. తీరా స్థిరాస్తి వ్యాపారం తగ్గడంతో ఆందోళన చెందుతున్నారు.
భవిష్యత్‌పై బెంగ
రియల్‌భూంతో తొలుత చాలామంది అప్పులు చేసి భూములను కొనుగోలు చేశారు. తీరా వ్యాపారం తగ్గడంతో దిక్కులు చూస్తున్నారు. కొనేవారు లేక అప్పులు ఊబిలో కూరుకుపోయారు. కనీసం వడ్డీలు కట్టలేని దుస్థితి చేరుకున్నారు. ఇందులో రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. వ్యాపారం జోరుమీదున్నప్పుడు నిరుద్యోగులు సైతం భూముల క్రయవిక్రయదారులకు మధ్యవర్తులుగా వ్యవహరించారు. రూ.లక్షల్లో ఆర్జించారు. ప్రస్తుతం దళారిగా వ్యవహరించిన వారిని మినహా ఇస్తే క్రయవిక్రయదారుల్లో చాలామంది నష్టాలను మూటగట్టుకున్నారు. భవిష్యత్‌పై బెంగపెట్టుకున్నారు. భూముల ధరలు పెరగకపోతాయా, దశ తిరగపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
దిక్కుతోచని స్థితిలో వ్యాపారులు
అప్పుల్లో కూరుకుపోయిన వైనం
నష్టాలను మూటగట్టుకున్నక్రయవిక్రయదారులు
కొనుగోలు చేసిన భూములు కౌలుకు..
సాగు చేస్తున్న రైతులు
పొలాలతో కళకళ
గడిచిన నాలుగేళ్లుగా చాలా వరకు భూములు సాగుకు నోచుకోలేదు. వ్యాపారం కోసం కొన్న భూములను.. వ్యాపారం పడిపోవడంతో.. రియల్టర్లు కొన్నిచోట్ల కౌలుకు ఇచ్చారు. కౌలుకు తీసుకున్న రైతులు ఎడారిగా మారిన భూములను సాగుకు అనుకూలంగా మార్చుకుని, పంటలు వేశారు. చాలా మంది రియల్ వ్యాపారానికి స్వస్తి పలికి వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. కానీ.. కూలీలు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండేళ్లుగా యూపీ, మహారాష్ట్ర నుంచి కూలీలు వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు. ఈ ఏడాది గ్రామస్తులే వ్యవసాయ పనులు చేసుకునేందుకు మొగ్గు చూపుతుండటంతో కొంత ఊరట లభించింది. ఏది ఏమైనా రియల్‌భూంతో ఎడారిగా మారిన సాగు భూములు.. రియల్ ఢమాల్‌తో నేడు పచ్చగా కనిపిస్తున్నాయి.

రియాల్టీ.. పల్టీ!
Comments
Please login to add a commentAdd a comment