
నిర్మాణం పూర్తయినా.. కేటాయించరే?
వికారాబాద్: డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను అర్హులకు కేటాయించడంలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. ఇటీవల జిల్లా కలెక్టర్ నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. అయినా ఈ దిశగా చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీంతో రెండు పడకల ఇళ్లను ఎప్పుడు కేటాయిస్తారనే విషయంలో స్పష్టత కొరవడింది. గతంలో స్వీకరించిన దరఖాస్తుల ప్రకారమే ఇళ్లు కేటాయిస్తారా..? లేక కొత్తగా అర్జీలు స్వీకరించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారా..? అనే అనుమానాలు స్థానికుల్లో తలెత్తుతున్నాయి. జిల్లాలో మొత్తం 1031 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందులో కొన్ని పూర్తయ్యి రెండేళ్లు కాగా.. మరికొన్ని నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు సైతం దాటింది. కొన్ని చోట్ల తుది మెరుగులు, చిన్న చిన్న పనులు మినహా పూర్తయ్యాయి. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావొచ్చిన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో పేదల నుంచి దరఖాస్తులు ఇప్పటికే స్వీకరించాయి. రెండుసార్లు విచారణ సైతం పూర్తి చేసి వాటిని పంపిణీ చేయటంలో తీవ్ర జాప్యం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత సర్కారు కూడా ఏ నిర్ణయం తీసుకోవటంలేదు. పూర్తయిన ఇళ్లు పాడవకముందే లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని పేదలు కోరుతున్నారు.
దరఖాస్తుల విచారణ పూర్తి
అర్హులను గుర్తించేందుకు ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో ముగ్గురు చొప్పున టీమ్‌లను ఏర్పాటు చేశారు. దరఖాస్తులు చేసుకున్న వారి జాబితా పట్టుకుని ఈ టీమ్‌లు వార్డుల వారీగా ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు. వచ్చిన దరఖాస్తులకు అందుబాటులోకి వచ్చిన ఇళ్లకు తీవ్ర వ్యత్యాసం ఉంది. లబ్ధిదారుల ఎంపిక కోసం జరిపిన విచారణలో వచ్చిన దరఖాస్తుల్లో 50 శాతం అర్హులు ఉన్నట్టు తేలింది. అర్హుల జాబితాను తగ్గించేందుకు మరోమారు విచారణ కూడా పూర్తి చేసిన అధికారులు ఏడాదిన్నర దాటినా వాటిని పేదలకు పంపిణీ చేసే దిశగా చర్యలు చేపట్టడంలేదు. జిల్లాలో 1031 ఇళ్ల నిర్మాణాలు తుది దశకు చేరుకోగా చిన్నచిన్న పనులు మినహా పూర్తి కావొచ్చాయి.
2016లోనే బీజం
జిల్లాకు మొదట్లో 5,740 డబుల్ బెడ్‌రూం ఇళ్లు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది. వీటికి సంబంధించి 2016 సంవత్సరంలో భూమి పూజ సైతం చేశారు. తరువాత వాటా సంఖ్యను 3,800కు కుదించారు. ప్రస్తుతం ఇందులో 2,257 ఇళ్లు నిర్మాణ దశశలో ఉన్నాయి. వీటిలో 1031 గృహాలు చిన్న చిన్న పనులు మినహా పూర్తి కావొచ్చాయి. 1,543 ఇళ్లు ఇంకా ప్రారంభించలేదు. పూర్తి కావొచ్చిన వాటిలో ధారూరులో 120, మర్పల్లి 120, యాలాల్ 180, తాండూరు పట్టణం 401, పరిగి 180, చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్‌లో 30 ఇళ్లను పేదలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇళ్లు పూర్తయిన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అందుబాటులో ఉన్న ఇళ్లకు పదింతలు ఎక్కువగా 12,205 అర్జీలు వచ్చాయి. దరఖాస్తుల వడపోత ప్రక్రియ పూర్తయి ఏడాదిన్నర అవుతున్నా.. ఇళ్లు కేటాయించడంతో మీనమేషాలు లెక్కిస్తున్నారు.
సిద్ధంగా 1031 డబుల్ బెడ్‌రూం ఇళ్లు
దరఖాస్తుల విచారణపూర్తయి ఏడాదిన్నర
ఎదురు చూస్తున్న లబ్ధిదారులు
Comments
Please login to add a commentAdd a comment