పాత లేఔట్లలోనే కబ్జాల జోరు
హైడ్రా ప్రజావాణిలో 49 ఫిర్యాదులు
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పాత లేఔట్లలోనే కబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తమ ప్లాట్లతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన పార్కులు, రహదారులను కబ్జా చేసేస్తున్నారంటూ ఆయా లేఔట్లకు చెందిన పలువురు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి (హైడ్రా) ఫిర్యాదు చేస్తున్నారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 49 ఫిర్యాదులు రాగా... అత్యధికం వీటికి సంబంధించినవే ఉన్నాయి. 1980–90 దశకాల్లో వేసిన లేఔట్లను మాయం చేసి, ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్న కబ్జారాయుళ్లు మళ్లీ విక్రయాలకు యత్నిస్తున్నారంటూ బాధితులు రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. భూములకు ధరలు అమాంతం పెరగడంతో గతంలో తమకు అమ్మిన వాళ్లే కబ్జాలకు పాల్పడుతున్నారని వాపోయారు. పంచాయతీ లేఔట్లను వ్యవసాయ భూములుగా మార్చేసి సాగు చేసుకుంటున్నారనీ హైడ్రాకు కొన్ని ఫిర్యాదులు అందాయి. వీటిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ ఫిర్యాదుదారుల సమక్షంలోనే గూగుల్ మ్యాప్‌లు, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లను పరిశీలించారు. వాటిలో లభించిన సమాచారం ఆధారంగా సమగ్ర విచారణకు అధికారులను ఆదేశించారు. ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడుతామని కమిషనర్ హామీ ఇవ్వడంతో పలువురు సంతోషం వ్యక్తం చేశారు.
● రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్‌గుల్ గ్రామంలో 1980 దశకంలో 2684 ప్లాట్లతో చాణక్యపురి లేఔట్ వేశారు. గత ఏడాది అందులోని 30 ఎకరాలు కబ్జాకు గురైనట్లు పలువురు ఫిర్యాదు చేశారు. అందులోని పార్కులు, రహదారులు కూడా కనుమరుగయ్యాయని ఆరోపించారు.
● మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నం.58, 59లో ఉన్న ఎన్‌ఎంఆర్–దివ్యానగర్ లేఔట్‌లో తాము ప్లాట్లు కొన్నామని, ఇప్పుడవి కనిపించట్లేదని యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇలా 66 ప్లాట్లు గల్లంతయ్యాయని, ఇప్పుడు అక్కడ వ్యవసాయం చేస్తున్నారని వాపోయారు.
● గచ్చిబౌలిలోని గోపన్నపల్లిలోని టీఎన్‌జీవో కాలనీలో ఉద్యోగులకు కేటాయించిన భూములు ఉన్నాయి. వీటిలో ఎనిమిది ఎకరాలను కొందరు కబ్జా చేసి ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారు. దీనిపై టీఎన్‌జీవో కాలనీ సంక్షేమ సంఘం (గచ్చిబౌలి) ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
● మేడ్చల్ జిల్లా చెంగిచర్ల గ్రామంలోని సర్వే నం.7, 10లో వేసిన శ్రీపురం కాలనీలో పార్కులు, రహదారులు కబ్జాకు గురయ్యాయని కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment