
స్థానిక సమస్యలపై పోరుబాట
యాచారం: స్థానిక సమస్యలపై సీపీఎం పోరుబాటకు సిద్ధమైందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోనే మొదటిసారి యాచారం మండలం నక్కర్తమేడిపల్లిలో మంగళవారం పర్యటించారు. పలు కాలనీల్లో తిరుగుతూ.. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గ్రామాల్లో పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని, పరిష్కారం కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని తెలిపారు. ఫార్మాసిటీ పేరుతో గత బీఆర్‌ఎస్ సర్కార్ ఆయా గ్రామాల్లో 9 వేల ఎకరాలకు పైగా అసైన్డ్, పట్టా భూములు సేకరించిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ రద్దు చేసి రైతులకు అండగా ఉంటామని చెప్పారని గుర్తు చేశారు. ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో ఫ్యూచర్‌సిటీ నిర్మిస్తామని చెప్పడం న్యాయం కాదన్నారు. గత ప్రభుత్వం లానే రేవంత్‌రెడ్డి సర్కార్ కూడా రైతుల భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. టీజీఐఐసీ పేరు మీద మార్చేసిన పట్టా భూముల రికార్డులను తిరిగి రైతుల పేర్లపై మార్చాలని హైకోర్టు ఆదేశించినా అధికారుల్లో చలనం లేదని విమర్శించారు. ఫార్మాసిటీని రద్దు చేశారా.. ఫ్యూచర్‌సిటీని ఏ విధంగా నిర్మిస్తున్నారో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మా భూ బాధితులకు అండగా ఉంటామన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, జిల్లా కమిటీ సభ్యుడు పి.అంజయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫార్మా భూ బాధితులకు అండగా ఉంటాం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
Comments
Please login to add a commentAdd a comment