చెల్లెలి స్నేహితురాలిపై వేధింపులు
యువకుడిపై కేసు
యాచారం: చెల్లెలి స్నేహితురాలిని వేధిస్తున్న ఓ యువకుడిపై యాచారం పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. గడ్డమల్లయ్యగూడ గ్రామానికి చెందిన ఓ యువతి, మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన మరో యువతి ఇబ్రహీంపట్నంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. ఆరుట్లకు చెందిన యువతి అన్న రావుల శ్రీకాంత్ గడ్డమల్లయ్యగూడకు చెందిన యువతికి తరచూ ఫోన్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. సదరు యువతి కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినా శ్రీకాంత్‌లో మార్పు రాకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యాచారం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బావిలో దూకి వృద్ధుడి బలవన్మరణం
మంచాల: అనారోగ్యం కారణంగా ఓ వృద్ధుడు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మంచాల ఎస్‌ఐ సతీశ్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన నలర్ల అంజయ్య(75) కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంగళవారం రాత్రి ఆయనకు కడుపునొప్పి వచ్చింది. అది భరించలేని ఆయన ఇంట్లో చెప్పకుండా వెళ్లి గ్రామంలోని తుంబావిలోకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం గమనించిన గ్రామస్తులు మృతుడి కుమారుడు లింగస్వామికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేపు దర్యాప్తు చేస్తున్నారు.
స్కూటీ అదుపుతప్పి..
ఒకరి మృతి.. మరొకరికి గాయాలు
ఇబ్రహీంపట్నం రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ జగదీశ్వర్ తెలిపిన ప్రకారం.. కడ్తాల్ మండలం అన్మాస్‌పల్లి గ్రామానికి చెందిన భువనగిరి శివకుమార్(55), జమ్మడ రాములుతో కలిసి స్కూటీపై ఉదయం ఇబ్రహీంపట్నం నుంచి కర్ణంగూడ మీదుగా చర్లపటేల్‌గూడకు వెళ్తున్నారు. శ్మశాన వాటిక వద్దకు రాగానే దిచక్రవాహనం అదుపు తప్పి రోడ్డు ప్రక్కన చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్‌కు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా రాములు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
శంషాబాద్ రూరల్: ఔటర్ రింగు రోడ్డు ఫెన్సింగ్ రాడ్‌కు ఉరి వేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి సమాచారం మేరకు... తొండుపల్లి శివారులో ఔటర్ రింగు రోడ్డు కింద రైల్వే ట్రాక్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకున్నట్లు ఈ నెల 3న రాత్రి స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి(25)కి సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. మృతుడి ఒంటిపై నీలిరంగు టీ షర్టు, నలుపు రంగు ప్యాంటు ఉన్నాయి. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ వివరించారు.
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
పీఅండ్‌టీ కాలనీలో అనుమతి లేని నిర్మాణాల కూల్చివేత
బండ్లగూడ: అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని నేలమట్టం చేస్తామని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.శరత్‌చంద్ర హెచ్చరించారు. కార్పొరేషన్ పరిధిలోని పీఅండ్‌టీ కాలనీలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను బుధవారం మున్సిపల్, టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా సెట్ బాక్స్‌లు లేకుండా అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామన్నాని కమిషనర్ శరత్‌చంద్ర స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని వాటిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ప్రజలందరూ నిబంధనలకు అనుగుణంగా తమ నిర్మాణాలను చేపట్టుకోవాలని సూచించారు. నిర్మాణాలు చేపట్టే సమయంలో పూర్తి అనుమతులు తీసుకోవాలని... ఆ తర్వాతే నిర్మాణాలు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చెల్లెలి స్నేహితురాలిపై వేధింపులు
Comments
Please login to add a commentAdd a comment