ఊడ్చిన నిధులెన్నో ?
రెండు నెలల్లోనే రూ.6 లక్షల పెనాల్టీలు
సాక్షి, సిటీబ్యూరో: ప్రజల నుంచి వివిధ పన్నుల రూపాల్లో వసూలు చేస్తున్న సొమ్మును జీహెచ్‌ఎంసీ కొందరు బడా కాంట్రాక్టర్ల పాల్జేస్తున్న వైనమిది. ఏళ్ల తరబడి ఎన్ని కోట్లు వారికి ధారాదత్తం చేశారో కానీ.. ఇటీవల చేపట్టిన తనిఖీల్లో సదరు కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్న స్వీపింగ్ మెషీన్ల పనితీరు బట్టబయలవుతోంది. ప్రధాన రహదారులను శుభ్రపరిచేందుకు జీహెచ్‌ఎంసీ అద్దె ప్రాతిపదిక స్వీపింగ్ మెషీన్లను నిర్వహిస్తోంది. వాటి కాంట్రాక్టర్లు ఒప్పందం మేరకు ఊడ్చాల్సినంత దూరం ఊడ్చకుండానే, శుభ్రం చేయాల్సిన మేర రోడ్లను శుభ్రం చేయకుండానే ఏడెనిమిదేళ్ల క్రితం రూ.30 కోట్ల నుంచి మొదలు పెట్టి ప్రస్తుతం ఏటా దాదాపు రూ. 47 కోట్లు జీహెచ్‌ఎంసీ నుంచి పొందుతున్నారు. కానీ.. ఒప్పందం మేరకు పనులు చేయకుండా పైకి కనిపించేందుకు మాత్రమే రోడ్లపై స్వీపింగ్ మెషీన్ల వాహనాలను తిప్పుతూ తూతూమంత్రంగా పనులు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాటి పని తీరుపై అనుమానం వచ్చిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సైతం తనిఖీలు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించిన నేపథ్యంలో నిర్వహిస్తున్న తనిఖీలతో వాటి పనితీరు బట్టబయలవుతోంది.
2 నెలలు.. రూ.6 లక్షల పెనాల్టీలు
ఈ సంవత్సరం జనవరి నుంచి నిర్వహించిన తనిఖీల్లో రెండు నెలల్లోనే స్వీపింగ్ మెషీన్లు సరిగ్గా పని చేయకుండా నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.6 లక్షల పెనాల్టీలు విధించారు. పలుమార్లు హెచ్చరికల తర్వాత సైతం ఇంతటి ఉల్లంఘనలు జరిగాయంటే.. అంతకుముందు ఎలాంటి పట్టింపు లేని సమయంలో అసలు పనిచేశాయో, లేదో అంచనా వేసుకోవచ్చు. ఆ లెక్కన ఎన్ని కోట్లు కాంట్రాక్టర్ల పరమయ్యాయో ఊహించుకోవచ్చు. గత పాలక మండళ్లలోని కీలకస్థానాల్లో ఉన్న వారి వల్లే.. సదరు కాంట్రాక్టర్లకు ఆ పనుల దక్కాయనే ఆరోపణలు గుప్పుమన్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. వాటి పనితీరునూ పట్టించుకోలేదు.
తిలాపాపం.. తలా పిడికెడు
స్వీపింగ్ మెషీన్ల పని తీరు, తనిఖీలు, వాటి బిల్లుల చెల్లింపులు జోన్ల స్థాయిలో జరుగుతున్నాయి. సంబంధిత సర్కిళ్ల డీసీలు, ఏఎంఓహెచ్‌ల పాత్ర కూడా చెల్లింపుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సరైన తనిఖీలు చేయకుండా, నిబంధనల ఉల్లంఘనలకు పెనాల్టీలు విధించకుండా కాంట్రాక్టర్లతో కుమ్మకై ్క నిధులు చెల్లించారనే ఆరోపణలున్నాయి. కొన్ని సర్కిళ్లలో గత రెండునెలల్లోనూ ఎలాంటి పెనాల్టీలు లేకపోవడం విశేషం. అంటే.. ఆ సర్కిళ్లలో స్వీపింగ్ మెషీన్లు కచ్చితంగా పని చేస్తున్నాయో, లేక సంబంధిత తనిఖీల అధికారులు మిలాఖాత్ అయ్యారో వారికే తెలియాలి.
38 మెషీన్లు.. రూ.47 కోట్లు
ప్రస్తుతం 38 స్వీపింగ్ మెషీన్లకు ఏటా దాదాపు రూ.47 కోట్లు చెల్లిస్తున్నారు. అయినా రోడ్లపై చెత్త ఉంటోంది. స్వీపింగ్ మెషీన్లతో ఊడిస్తే రోడ్లపై ఎలాంటి చెత్త కనిపించరాదు. కానీ.. పని చేయని చీపుర్లతో ఊడ్చాల్సినంత దూరం ఊడ్చకుండా మమ అనిపిస్తున్నారు. పేరుకు జీపీఎస్ ట్రాకింగ్ అయినా సిస్టమ్ సరిగ్గా లేదని భావించిన కమిషనర్ వాహనాలకు ముందు, వెనుక సీసీ కెమెరాలు అమర్చి పరిశీలించాల్సిందిగా ఆదేశించడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఆ చర్యలు ప్రారంభించినట్లు సంబంధిత విభాగం పేర్కొంది.
రెండు నెలల్లో ఆయా సర్కిళ్లలో విధించిన పెనాల్టీలు
సర్కిల్ పెనాల్టీ
(రూపాయలు)
శేరిలింగంపల్లి 3,80,000
మల్కాజిగిరి 64,000
రాజేంద్రనగర్ 85,000
ఉప్పల్ 25,000
కాప్రా 10,000
హయత్‌నగర్ 10,000
ఫలక్‌నుమా 10,000
కార్వాన్ 15,000
గోషామహల్ 11,000
అల్వాల్ 10,000
బట్టబయలవుతున్న స్వీపింగ్ యంత్రాల పని తీరు
ఏళ్ల తరబడి దోచుకున్న ప్రజా ధనమెంతో?
Comments
Please login to add a commentAdd a comment