ముద్ర లోన్‌ పేరిట మోసం | - | Sakshi
Sakshi News home page

ముద్ర లోన్‌ పేరిట మోసం

Published Fri, Mar 7 2025 9:23 AM | Last Updated on Fri, Mar 7 2025 9:19 AM

ముద్ర

ముద్ర లోన్‌ పేరిట మోసం

యాచారం: ఇటీవల అపరచిత వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లకు స్పందిస్తూ మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి రూ.5లక్షల ముద్రలోన్‌ మంజూరైందని చెప్పిన వెంటనే బాధితుడు అపరిచిత వ్యక్తిన చెప్పిన విధంగా విడతల వారీగా రూ.45,490 పంపించాడు. ఆతరువాత ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించి గురువారం యాచారం పోలీసులను ఆశ్రయించాడు. సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని గునుగల్‌ గ్రామానికి చెందిన రామన్నకు ఈ నెల 4న అపరిచిత వ్యక్తి ఫోన్‌ చేశాడు. నీకు రూ.5 లక్షల ముద్రలోన్‌ మంజూరైందని తాను పంపే స్కానర్‌కు రూ.50వేలు పంపించాలని రామన్న వాట్సాప్‌కు స్కానర్‌ పంపించాడు. దీంతో విడతల వారీగా రూ.45,490 పంపాడు. ఆ తర్వాత సదరు వ్యక్తికి ఫోన్‌ చేస్తే ఎటువంటి స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

సివిల్‌సప్లై అధికారుల

ఆకస్మిక దాడులు

రేషన్‌ దుకాణం సీజ్‌

శంకర్‌పల్లి: మున్సిపల్‌ పరిధిలోని ఫత్తేపూర్‌ రేషన్‌ దుకాణంపై గురువారం సివిల్‌సప్లై అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. యాదయ్యగౌడ్‌ నిర్వహిస్తున్న రేషన్‌ దుకాణంలో పెద్ద ఎత్తున బియ్యం నిల్వలున్నాయని.. వీటిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాడని పలువురు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన సివిల్‌సప్లై అధికారులు ఆకస్మికంగా దాడి చేసి దుకాణం సీజ్‌ చేశారు. ఎన్ని క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉంచారో శుక్రవారం లెక్కించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఇదే విషయమై తహసీల్దార్‌ సురేందర్‌ను వివరణ కోరగా సివిల్‌ సప్లై అధికారుల ఆదేశాల మేరకు రేషన్‌ దుకాణం వద్దకు ఆర్‌ఐను పంపామన్నారు.

బిర్యానీ సెంటర్‌లో మంటలు

షాబాద్‌: ప్రమాదవశాత్తు ఓ హోటల్‌లో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన బిర్యానీ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం ఒక్కసారిగా గ్యాస్‌ సిలిండర్‌లో మంటలు చెలరేగాయి. గమనించిన యజమాని, చుట్టు పక్కల వారు నీరు పోసి మంటలార్పారు. అప్పటికే హోటల్‌లోని సామగ్రి కాలిబూడిదైంది.

దూరదర్శన్‌ మాజీ డైరెక్టర్‌ బాలకృష్ణ కన్నుమూత

లక్డీకాపూల్‌: దూరదర్శన్‌ మాజీ డైరెక్టర్‌ దేవళ్ల.బాలకృష్ణ ( 92) గురువారం కన్నుమూశారు. హైదరాబాద్‌ దూరదర్శన్‌ కేంద్రం సంచాలకుడిగా పని చేయక ముందు ఆయన హైదరాబాద్‌ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల ఆకాశవాణి , దూరదర్శన్‌ కార్యక్రమ సిబ్బంది సంతాపం తెలిపారు. ఆకాశవాణి, దూరదర్శన్‌ అభివృద్ధికి బాలకృష్ణ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. శుక్రవారం ఉదయం అంబర్‌పేట శ్మశానవాటికలో బాలకృష్ణ అంత్యక్రియులు నిర్వహించనున్నట్లు ఆయన బంధువు సాయి ప్రసాద్‌ పేర్కొన్నారు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఊరట

మూడు కేసులను కొట్టివేసిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు

సిటీ కోర్టు: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నమోదైన మూడు కేసులను కొట్టివేస్తున్నట్లు నాంపల్లి లోని ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. శ్రీరామనవమి ర్యాలీ, గత ఎన్నికల్లో చేపట్టిన ప్రచార ర్యాలీల సందర్భంగా సిటీలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని, దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సోషల్‌ మీడియాలో తప్పుడు స్పీచ్‌లు ఇచ్చారని ఆయనపై పలువురు సిటీలోని ఆయా పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగా రాజాసింగ్‌ తరుఫు న్యాయవాది కరుణసాగర్‌ గతవారం నాంపల్లిలోని స్పెషల్‌ జ్యుడీషల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో వాదనలు వినిపించారు. పోలీసుల తరుఫున అదనపు పబ్లిక్‌ ప్రాసీక్యూటర్‌ ఆర్‌.శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది. దీంతో గురువారం చేపట్టిన విచారణలో రాజాసింగ్‌ తరుఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఆయనపై నమోదైన మూడు కేసులను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
ముద్ర లోన్‌ పేరిట మోసం 1
1/1

ముద్ర లోన్‌ పేరిట మోసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement