సిటీ కోర్టులు: రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసుపై గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు (స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్)లో విచారణ జరిగింది. ఈ విచారణకు పిటిషనర్ నాగార్జునతోపాటు ప్రతివాది మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడంతో వారి తరుఫున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు విచారణను మార్చి 12కు వాయిదా వేసింది. సినీ అగ్రహీరో నాగార్జున కుమారుడైన హీరో నాగాచైతన్య–సమంత విడాకుల విషయంపై మంత్రి కొండా సురేఖ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని, ఆమె చేసిన వ్యాఖ్యలతో తన కుటుంబ పరువుపోయిందని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన కుటుంబంపై అసాధారణమైన వ్యాఖ్యలు చేసినందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు జారీ చేయగా గత విచారణలో ఆమె వ్యక్తిగతంగా హాజరయ్యారు. దీంతో కొండా సురేఖ వ్యక్తిగత బాండ్‌తోపాటు రూ.10 వేలు పూచీకత్తు కోర్టులో దాఖలు చేయాలని కోర్టు సూచించింది. అయితే గురువారం జరిగిన విచారణకు ఆమె హాజరుకాకపోవడమే కాకుండా పూచీకత్తులు కూడా దాఖలు చేయలేదు. వచ్చే వాయిదా లోపు పూచీకత్తులు దాఖలు చేసుకోవాలని కొండ సురేఖ తరుఫు న్యాయవాదికి కోర్టు సూచిస్తూ విచారణను వాయిదా వేసింది.
మంత్రి కొండా సురేఖ, హీరో నాగార్జున గైర్హాజరు
విచారణ మార్చి 12కు వాయిదా
Comments
Please login to add a commentAdd a comment