నిరుపేద కుటుంబానికి తీరని కష్టం
కొందుర్గు: రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి తీరని కష్టమొచ్చింది. రోజంతా కూలి పనులు చేస్తేనే పూట గడిచే పరిస్థితిలో విధి చిన్నచూపు చూసింది. ఇందుకు సంబంధించి బాధితులు, స్థానికుల వివరాల ప్రకారం.. కొందుర్గు మండలం ఆగిర్యాలకు చెందిన బేగరి నవనీత, ఆంజనేయులు దంపతులకు ఐదేళ్లలోపున్న లక్కీ, చింటూ ఇద్దరు కుమారులు సంతానం. వ్యవసాయ భూమి లేకపోవడంతో భార్యాలిద్దరూ నిత్యం కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. రోజూమాదిరిగానే ఆంజనేయులు గత ఫిబ్రవరి 18న వికారాబాద్ జిల్లా చౌడాపూర్‌లో ఓ ఇంటికి రంగులు వేయడానికి కూలికి వెళ్లాడు. పని చేస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని 108 అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆంజనేయులు రెండు చేతులకు తీవ్రమైన కాలిన గాయాలు కావడంతో ఇన్‌ఫెక్షన్ సోకింది. దీంతో మరుసటి రోజైన 19న అతని రెంతు చేతులను మోచేతి వరకూ తొలగించారు. మరో మూడు రోజుల తర్వాత కాళ్లకు కూడా ఇన్‌ఫెక్షన్ సోకడంతో కుడి కాలును తొలగించారు. ఎడమ కాలి వేళ్లు తీసేశారు. రెండు రోజుల క్రితం కుడి చేయిని భుజం వరకు తొలగించారు. ప్రస్తుతం ఎడమ కాలికి ఇన్‌ఫెక్షన్ ఎక్కువైందని, కాలును తీసేయకపోతే శరీరం మొత్తం విషం పాకుతుందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. నవనీత ఆస్పత్రిలోనే ఉంటూ అతనికి సపర్యలు చేస్తోంది. అక్కడే ఉన్న ఇద్దరు చిన్నారులు సైతం తండ్రి పరిస్థితిని చూసి రోదిస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో ఆస్పత్రిలో పెడుతున్న ఆహారంతో పాటు ఇతర పేషెంట్లను చూసేందుకు వచ్చిన వారు ఇస్తున్న ఆహార పదార్థాలు తింటూ కాలం వెల్లదీస్తున్నారు. తమ భవిష్యత్తు ఏమిటో తెలియక నవనీత గుండెలు బాదుకుంటోంది. ప్రభుత్వ చేయూతతో పాటు దాతల సాయం కోసం అర్థిస్తోంది.
కూలి పనులకు వెళ్లి విద్యుత్ షాక్‌కు గురైన వ్యక్తి
ఇన్‌ఫెక్షన్ సోకడంతో రెండు చేతులూ, కుడి కాలు తొలగింపు
ఎడమ కాలిని సైతం తీసేయాలని చెబుతున్న వైద్యులు
దిక్కుతోచని స్థితిలో కుటుంబసభ్యలు
ప్రభుత్వం, దాతల సాయం కోసం ఎదురుచూపు
Comments
Please login to add a commentAdd a comment