హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలో చెరువుల అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తామని, వాటికి పునరుజ్జీవం కల్పించడంతో పాటు సుందరీకరణకు కార్పొరేట్ సంస్థలు సీఎస్సార్ నిధులు అందించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కోరారు. గురువారం నానక్‌రామ్‌గూడలోని ఖాజాగూడ పెద్ద చెరువుతో పాటు నెక్నాంపూర్‌లో ఉన్న ఇబ్రహీంబాగ్ చెరువును ఆయన పరిశీలించారు. ఖాజాగూడ చెరువు అభివృద్ధికి ఆటంకంగా మారిన అంశాలను ఆ పనులు చేపట్టిన ఎన్‌ఎస్‌ఎల్ ఇన్‌ఫ్రా, దివ్యశ్రీ ఇన్‌ఫ్రా సంస్థల ప్రతినిధులు రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణం స్పందించిన ఆయన ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఆయా చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా కాలువల మళ్లింపు పనులు చేపట్టాలని సూచించారు. పర్యాటకుల్ని ఆకర్షించేలా చెరువుల పరిసరాలను సుందరీకరించాలని, ఈ క్రతువులో పర్యాటకాభివృద్ధి సంస్థ కూడా భాగస్వామ్యం కావాలని తన వెంట ఉన్న ఈ శాఖ ఏజీఎం వరప్రసాద్‌కు రంగనాథ్ సూచించారు. నెక్నాంపూర్‌లోని ఇబ్రహీంబాగ్ చెరువు ఆక్రమణల్ని ఇటీవలే తొలగించామని హైడ్రా కమిషనర్ తెలిపారు. ఒకప్పుడు దుర్గం చెరువు, ఖాజాగూడ చెరువు, మల్కం చెరువు, ఫిలింనగర్ చెరువుల నుంచి వరద నీరు ఇబ్రహీంబాగ్ చెరువుకు చేరేదని స్థానికులు అఽధికారులకు తెలిపారు. నివాస ప్రాంతాలు పెరిగిపోవడంతో చెరువులు, మురుగుతో నిండిపోయాయన్నారు. 88 ఎకరాలకు పైగా ఉన్న ఇబ్రహీంబాగ్ చెరువు చుట్టూ తిరిగిన రంగనాథ్ స్థానికులతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment