మందుబాబులు... మహా ముదుర్లు! | - | Sakshi
Sakshi News home page

మందుబాబులు... మహా ముదుర్లు!

Published Tue, Mar 11 2025 7:24 AM | Last Updated on Tue, Mar 11 2025 7:24 AM

మందుబాబులు... మహా ముదుర్లు!

మందుబాబులు... మహా ముదుర్లు!

డ్రంకెన్‌డ్రైవ్‌ పరీక్షలు తప్పించుకునే ప్రయత్నాలు

పోలీసుల ఎత్తులకు పై ఎత్తులు

ప్రత్యేకంగా కొన్ని వాట్సాప్‌ గ్రూపులు సైతం ఏర్పాటు

ప్రాంతాల వారీగా తనిఖీ చేస్తున్న ఏరియాలు గుర్తింపు

వాటిని లోకేషన్స్‌తో సహా గ్రూపుల్లో పోస్టు చేస్తున్న వైనం

సాక్షి, సిటీబ్యూరో: ‘శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు‘ అన్న నానుడిని నగరంలోని మందుబాబులు బాగా ఒంట పట్టించుకున్నట్లున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి చెక్‌ చెప్పడానికి ట్రాఫిక్‌ విభాగం అధికారులు ప్రత్యేక డ్రైవ్స్‌ నిర్వహిస్తున్నారు. వీరికి చిక్కకుండా తప్పించుకోవడానికి ‘నిషా’చరులు అనేక మార్గాలు అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులు క్రియేట్‌ చేసుకోవడం ఇటీవల పెరిగిందని పోలీసులు గుర్తించారు. దీనికి చెక్‌ చెప్పడానికి అవసరమైన మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.

13 ఏళ్ల నుంచి కఠినంగా..

రోడ్డు ప్రమాదాలను సీరియస్‌గా తీసుకున్న ఐక్యరాజ్య సమితిలోని అంతర్భాగమైన డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్‌ రోడ్‌ సేఫ్టీ పార్ట్‌నర్‌ షిప్‌ (జీఆర్‌ఎస్పీ) పేరిట అధ్యయనం చేపట్టింది. బ్లూమ్‌ బర్గ్‌ యూనివర్సిటీ, జాన్‌ హాకింగ్‌ వర్సిటీలతో కలిసి అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న 10 దేశాలను గుర్తిచడంతో పాటు వాటి నివారణకు ఆర్‌ఎస్‌–10 పేరుతో ప్రాజెక్టు చేపట్టింది. ఆయా దేశాల్లో కొన్ని నగరాలను ఎంపిక చేసుకుని ప్రమాదాల నివారణకు అసరమైన ఉపకరణాలు అందించడంతో పాటు సిబ్బందికి కెపాసిటీ బిల్డింగ్‌ శిక్షణలు ఇచ్చింది. భారత్‌ నుంచి హైదరాబాద్‌తో పాటు జలంధర్‌ ఎంపికయ్యాయి. దీంతో 2011 నవంబర్‌లో సిటీ పోలీసులకు బ్రీత్‌ అనలైజర్లు 10, డిజిటల్‌ కెమెరాలు 220, బారికేడ్లు 250, రిఫ్లెక్టివ్‌ జాకెట్లు 550, ఎల్‌ఈడీ బేటన్స్‌ 450 అందాయి. అప్పటి నుంచి డ్రంక్‌ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్స్‌ మొదలు కావడంతో పాటు ‘నిషా’చరుల్ని కోర్టుకు తరలించడం సాధ్యమైంది. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ చిక్కిన వారికి జరిమానాలతో పాటు జైలు శిక్షలు పడటం మొదలైంది.

‘బ్యాక్‌’తో మొదలై వాట్సాప్‌ వరకు..

ఈ స్పెషల్‌ డ్రైవ్స్‌లో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు‘నిషా’చరులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తొలినాళ్లల్లో ఈ మందుబాబులు రహదారిలో ప్రయాణిస్తున్నప్పుడు ముందు తనిఖీలను గుర్తిస్తే వెంటనే తమ వాహనాన్ని వెనక్కు తిప్పుకుని రాంగ్‌ రూట్‌లో, లేదా పక్కన ఉన్న సందుల్లోకి జారుకునేవారు. దీనికి చెక్‌ చెప్పేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ‘ఫీల్డింగ్‌ టీమ్స్‌’ ఏర్పాటు చేశారు. వీరు డ్రైవ్‌ జరుగుతున్న ప్రాంతానికి కాస్తా ముందు నుంచి కాపుకాసి ఇలా ఉడాయించే వారిని పట్టుకోవడం మొదలెట్టారు. దీంతో మందుబాబులు ఏరియాల వారీగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజూ వాటిలో తమతమ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఈ డ్రైవ్స్‌ జరుగుతున్నాయో పోస్టు చేస్తున్నారు. కొందరు గ్రూపు సభ్యులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉండటంతో దాదాపు అన్ని ఏరియాల సమాచారం ఆ గ్రూపుల్లోకి వచ్చి, మద్యం తాగి ఉన్న వాళ్లు పోలీసులకు చిక్కకుండా జారుకుంటున్నారు.

చెక్‌ చెప్పేందుకు మార్గాల అన్వేషణ

ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఈ డ్రంక్‌ డ్రైవింగ్‌ చేసే వారిని పట్టుకోవడానికి చేస్తున్న స్పెషల్‌ డ్రైవ్స్‌ సందర్భంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహనచోదకులతో పాటు పోలీసులకు ఎలాంటి ముప్పు ఉండకూడదనే ఉద్దేశంతో రహదారి స్థితిగతులు తదితరాలను పరిశీలించి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ ఏరియాలు ఒక్కో ట్రాఫిక్‌ ఠాణాలో గరిష్టంగా ఐదే ఉంటున్నాయి. మరోపక్క ఈ డ్రైవ్స్‌ చేపట్టడానికి బారికేడ్లు, టోవింగ్‌ వాహనం సహా మరికొన్ని సదుపాయాలు అనివార్యం. దీంతో పోలీసులు ఆకస్మికంగా వేర్వేరు ప్రాంతాల్లో ఈ డ్రైవ్స్‌ చేపట్టడం సాధ్యం కావట్లేదు. ఇవన్నీ మందుబాబులకు కలిసి వస్తున్నట్లు ట్రాఫిక్‌ అధికారులు గుర్తించారు. పోలీసులతో పాటు మద్యం మత్తులో వాహనం నడిపే వారికీ ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ‘నిషా’చరులు ఇలాంటి పై ఎత్తులు వేయడం వల్ల స్పెషల్‌ డ్రైవ్స్‌ స్ఫూర్తి దెబ్బతింటోందని చెబుతున్న పోలీసులు వీరిని కట్టడి చేయడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement