రికవరీ ఫోన్ల అప్పగింత
ధారూరు: మండల పరిధిలోని వివిధ గ్రామాలు, తండాల్లో పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బాధితులకు తొమ్మిది సెల్‌ఫోన్లను అప్పగించినట్లు ఎస్‌ఐ అనిత తెలిపారు.
నాలుగు టిప్పర్లు, జేసీబీ సీజ్
కడ్తాల్: నిబంధనలకు విరుద్ధంగా మట్టితరలిస్తుండగా పోలీసులు దాడులు చేపట్టి వాహనాలను సీజ్ చేశారు. ఎస్‌ఐ వరప్రసాద్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని అన్మాస్‌పల్లి సమీపంలోని సర్వేనంబర్ 321/1లో ఉన్న ప్రభుత్వ భూమి నుంచి మట్టి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేసి నాలుగు టిప్పర్లు, ఓ జేసీబీని స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు జేసీబీ, టిప్పర్ డ్రైవర్లతో పాటు ఆయా వాహనాల యజమానులు మునావత్ శ్రీను(గానుగుమార్లతండా), నేనావత్ శ్రీను(పుల్లేరుబోడ్ తండా)పై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
కారు, ఆటో ఢీ..
ముగ్గురికి గాయాలు
ఇబ్రహీంపట్నం: ఓ కారు, గూడ్స్ ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్‌ఐ నాగరాజు తెలిపిన ప్రకారం.. నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిలో గురునానక్ విద్యాసంస్థల సమీపంలో ఎదురెదురుగా ప్రయాణిస్తున్న ఓ ఆల్టోకారు, టాటాఏస్ గూడ్స్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో ఉన్న ఇద్దరు, ఆల్టోకారులో ప్రయాణిస్తున్న కానిస్టేబుల్ మహేశ్వర్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందకపోవడంతో పూర్తి వివరాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు.
వరద కాల్వను పూడుస్తున్న వారిపై చర్యలు తీసుకోండి
మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని సురంగల్ పెద్ద చెరువులోకి వచ్చే వరద కాల్వను పూడుస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని సురంగల్‌కు చెందిన గడ్డం వెంకట్‌రెడ్డి తహసీల్దార్ గౌతమ్‌కుమార్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన సోమవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సురంగల్‌లోని పెద్ద చెరువులోకి కనకమామిడి వైపు నుంచి వరదకాల్వ వస్తుందని.. నజీబ్‌నగర్ రెవెన్యూలోని సర్వే నెంబర్ 73, 74 వద్ద న్యాయవాది వలీ వరదకాల్వను పూర్తిగా పూడ్చివేసి తన పొలంలో కలుపుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకుని కాలువ పూడ్చివేయడాన్ని అడ్డుకోవాలని కోరారు.
కుక్కల దాడిలో జింక మృతి
అనంతగిరి: వికారాబాద్‌కు సమీపంలోని అనంతగిరి అడవుల్లో సోమవారం వీధి కుక్కల దాడిలో ఓ జింక(దుప్పి) మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. ఉదయం అడవిలో సంచరిస్తున్న జింక(దుప్పి)పై ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేశాయి. గమనించిన పలువురు వాటిని చెదరగొట్టారు. అనంతరం అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. వారు వచ్చేలోపు జింకమృతి చెందింది.
రికవరీ ఫోన్ల అప్పగింత
రికవరీ ఫోన్ల అప్పగింత
Comments
Please login to add a commentAdd a comment