జనం నెత్తిన కాలుష్య భూతం! | - | Sakshi
Sakshi News home page

జనం నెత్తిన కాలుష్య భూతం!

Published Tue, Mar 11 2025 7:24 AM | Last Updated on Tue, Mar 11 2025 7:25 AM

జనం నెత్తిన కాలుష్య భూతం!

జనం నెత్తిన కాలుష్య భూతం!

● సాయంత్రం సీజ్‌..ఉదయం కాంక్రీట్‌ తయారీ ● పీసీబీ ఆదేశాలను లెక్కచేయనిరెడీమిక్స్‌ ప్లాంట్లు ● శంషాబాద్‌, కొత్వాల్‌గూడ, నార్సింగి, కోకాపేట్‌లో ఇష్టారాజ్యం ● అనుమతుల్లేని ప్లాంట్లకు అడ్డగోలుగా విద్యుత్‌ కనెక్షన్లు ● తరచూ ఆందోళనకు దిగుతున్న స్థానికులు.. ● పట్టించుకోని అధికారులు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: నగర శివారు ప్రాంతాలను రెడీమిక్స్‌ కాంక్రీట్‌ రూపంలో కాలుష్యభూతం పట్టి పీడిస్తోంది. ఇళ్ల పక్కనే ఏర్పాటు చేసిన రెడీమిక్స్‌ ప్లాంట్లు వెదజల్లుతున్న కాలుష్యం స్థానికుల పాలిట శాపంగా మారుతోంది. వాతావరణంలో చేరిన ధుమ్ము, ధూళీ కణాలు, ఘాటు వాసనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆస్తమా బాధితులు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రెడీమిక్స్‌ ప్లాంట్లను జనావాసాలకు దూరంగా తరలించాలని స్థానికులు ఆందోళన చేస్తున్నా పట్టించుకునే నాథుడేలేడు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, మున్సిపాలిటీలు, పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నా బుట్టదాఖలవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడే స్వచ్ఛంద సంస్థలు జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించి, వాటి మూసివేతకు ఆదేశాలు జారీ చేయించినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. హిమాయత్‌సాగర్‌ పరిసర ప్రాంతాల్లో వెలిసిన 21 రెడీమిక్స్‌ ప్లాంట్లను పీసీబీ అధికారులు ఇటీవల సీజ్‌ చేశారు. అయితే ఇలా సీజ్‌ చేసి... అధికారులు అలా ఇంటికి చేరుకునే లోపే మళ్లీ అవి తెరుచుకోవడం గమనార్హం.

111జీఓ పరిధిలోనూ ఆర్‌ఎంసీ ప్లాంట్లు

సైబరాబాద్‌ పరిధిలోని నార్సింగి, మణికొండ, వట్టినాగులపల్లి, ఖానాపూర్‌, కోకాపేట్‌, శంషాబాద్‌, కొత్వాల్‌గూడలో, గండిపేట, హిమాయత్‌సాగర్‌ పరిసరాలతోపాటు రాచకొండ పొలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు అటు ఇటుగా ఉన్న తారామతిపేట్‌, పెద్ద అంబర్‌పేట్‌, కోహెడ,, ఆదిభట్ల, కొంగర, తుక్కుగూడలోనూ పెద్ద సంఖ్యలో బహుళ అంతస్తుల నిర్మాణాలు, గెటేడ్‌ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. వీటికి సిమెంట్‌, కంకర, ఇసుక, స్టీలు పెద్ద మొత్తంలో అవసరమవుతోంది. నిజానికి ఏదైనా నిర్మాణ ప్రదేశంలో కానీ, ఇతర ప్రాంతంలో కానీ ఒక ఆర్‌ఎంసీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటే ముందు పరిశ్రమల శాఖ అనుమతి పొందాలి. ఆ తర్వాత రెవెన్యూ శాఖ, మున్సిపాలిటీల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించాలి. శంషాబాద్‌, కొత్వాల్‌గూడ, గండిపేట్‌, హిమాయత్‌సాగర్‌ పరిసరాలన్నీ 111 జీఓ పరిధిలో ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు కానీ, పరిశ్రమలు కానీ ఏర్పాటు చేయవద్దనే ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ పలు నిర్మాణసంస్థలు తమకున్న రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని ఆయా శాఖల నుంచి అనుమతులు పొందకుండానే ఇష్టారాజ్యంగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. అడిగినంత ముట్టజెప్పితే చాలు కరెంటోళ్లు కళ్లు మూసుకుని వాటికి కనెక్షన్లు ఇస్తున్నారు.

వీటిని సాకుగా చూపించి...

ఏదైనా బహుళ అంతస్థుల నిర్మాణాల ముడిసరుకును ఇతర ప్రాంతాల నుంచి లారీలు, టిప్పర్లలో తరలించాల్సి వస్తుంది. అధికలోడు వాహనాల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయి. ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని సాకుగా చూపించి, నిర్మాణ సంస్థలు తమ స్థలంలోనే రెడీమిక్స్‌ పాంట్‌ ఏర్పాటు చేసుకుంటున్నాయి. చాలా రెడీమిక్స్‌ వాహనాలు నిర్మాణ ప్రాంగణం దాటి బయటికి వచ్చి ఇతర ప్రాంతాల్లోని నిర్మాణాలకు ముడిసరుకును చేరవేస్తున్నాయి. ఈ సమయంలో రోడ్లపై కంకర, సిమెంట్‌ జారిపడుతున్నాయి. దీంతో ఇతర వాహనదారులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

మచ్చుకు కొన్ని ప్లాంట్లు

ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ 13 నుంచి కొంగర కలెక్టరేట్‌ మార్గమధ్యలో ఏర్పాటు చేసిన రెడీమిక్స్‌ ప్లాంట్‌కు వచ్చి వెళ్లే వాహనాల నుంచి కాంక్రీక్‌ రోడ్డుపై పడుతోంది. నిత్యం ఇదే రోడ్డు నుంచి జిల్లా ఉన్నతాధికారులంతా రాకపోకలు సాగిస్తుంటారు. అయినా పట్టించుకోకపోవడం గమనార్హం. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఓఆర్‌ఆర్‌ వెంట వెలసిన కాంకీట్‌ యూనిట్‌కు వచ్చి పోయే వాహనాలతో సర్వీసు రోడ్డు దెబ్బతింటోంది.

● మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని మైహోం అవతార్‌, హాల్‌మార్క్‌ విసినియా అపార్ట్‌మెంట్ల మధ్య వెలసిన ఆర్‌ఎంసీ నుంచి వెలువడే కాలుష్యంతో వాతావరణం పూర్తిగా కాలుష్యమవుతోందని, అపార్ట్‌మెంట్ల పరిసరాలు ధుమ్ము, ధూళితో నిండిపోతున్నాయని, ప్రజారోగ్యానికి హానికరంగా మారిన ఈ ప్లాంట్‌ను తక్షణమే మూసివేయించాలని ఇటీవల స్థానికులు పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగారు.

● ఓఆర్‌ఆర్‌కు సమీపంలోని కోహెడ–బ్రాహ్మణపల్లి సరిహద్దులో ఏర్పాటు చేసిన రెడీమిక్స్‌ ప్లాంట్‌తో ఆ పరిసర ప్రాంతాలన్నీ దెబ్బతిన్నాయి. చుట్టు పక్కన ఉన్న పంటలు, ఖాళీ ప్లాట్ల నిండా సిమెంట్‌, డస్ట్‌ పేరుకుపోయాయి. తారమతిపేట, బాకారం, అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిసర ప్రాంతాల్లోనూ ఈ ప్లాంట్లతోపాటు క్రషర్‌ మిషన్లు భారీగాఏర్పాటయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement