షాద్‌నగర్ రూరల్: మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఫరూఖ్‌నగర్ మండలం అయ్యవారిపల్లిలో శుక్రవారం వెలుగు చూసింది. పట్టణ సీఐ శంకరయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన పరశురాములు, జమున (38) భార్యాభర్తలు. వీరి ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేయడంతో అత్తవారి ఇళ్లలో ఉన్నారు. పరశురాములు కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మరింత మద్యం కోసం డబ్బులు ఇవ్వమని భార్యతో గొడవ పడ్డాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడై ఇంట్లోని గొడ్డలితో జమున గొంతుపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
భూమి డబ్బుల కోసమే..
గతంలో అమ్మిన భూమికి సంబంధించిన రూ.2.50 లక్షలను జమున తెలిసిన వారికి అప్పుగా ఇచ్చింది. భార్యను చంపితేనే ఆ డబ్బులు తనకు వస్తాయని భావించిన పరశురాములు.. నిద్రిస్తున్న జమునపై గొడ్డలితో కిరాతకంగా దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. హత్యకు వినియోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
భార్యను హత్య చేసిన భర్త
మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని దారుణం
నిందితుడికి రిమాండ్