
బలహీనత ఖరీదు రూ.1.57 లక్షలు!
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ యువకుడి చిన్న బలహీతన రూ.1.57 లక్షలు నష్టపోవడానికి కారణమైంది. ఆన్‌లైన్‌లో కనిపించిన ఎస్కార్ట్ సర్వీస్ ప్రకటనకు ఆకర్షితుడైన సదరు యువకుడు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న యువకుడిని నిర్ణీత మొత్తం చెల్లిస్తే ఏకాంత సేవలు అందిస్తాం అంటూ ఆన్‌లైన్‌లో వచ్చిన ప్రకటన ఆకర్షించింది. అందులో ఉన్న ఫోన్ నెంబర్‌లో సంప్రదించగా... ఈ సేవల కోసం రూ.4 వేలు చెల్లించాలని అవతలి వారు చెప్పారు. తొలుత తమకు రూ.500 చెల్లించాలని, ఆపై తాము సేవలు అందించే యువతితో పాటు చేరుకోవాల్సిన హోటల్ వివరాలు అందిస్తామన్నారు. అక్కడకు వెళ్లిన తర్వాత మిగిలిన మొత్తం ఇవ్వాలని సూచించారు. దీంతో సదరు యువకుడు వారు సూచించిన ఖాతాకు రూ.500 చెల్లించాడు. ఆపై ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు మిగిలిన మొత్తం కూడా బదిలీ చేయించుకున్నారు. అంతటితో ఆగకుండా యువకుడి నుంచి వీలున్నంత ఎక్కువ గుంజాలని పథకం వేశారు. దీనిని అమలులో పెడుతూ సెక్యూరిటీ డిపాజిట్, ఐడీ వెరిఫికేషన్ పేమెంట్, పోలీస్ వెరిఫికేషన్ అండ్ సేఫ్టీ పేమెంట్ పేరుతో డబ్బు వసూలు చేశారు. అతడికి అనుమానం వచ్చిన ప్రతిసారీ రూ.4 వేలు మినహా మిగిలింది రిఫండ్ అవుతుందని నమ్మించారు. ఓ దశలో రెండు నిమిషాల్లో రిఫండ్ మొత్తం వస్తుందంటూ మరికొంత, వేగంగా రిఫండ్ కావాలంటే తప్పదంటూ రెట్టింపు మొత్తం బదిలీ చేయించుకున్నారు. ఇలా మొత్తం రూ.1,57,381 బదిలీ చేయించుకున్న తర్వాత ‘ప్రాసెస్ పూర్తయింది. నగదు రిఫండ్ చేయడానికి మీ బ్యాంకుఖాతా వివరాలు పంపండి. మీ బుకింగ్ ఐడీ, హోటల్ పేరు, రూమ్ నెంబర్ తదితరాలు లోకంటో.కామ్ అనే వెబ్‌సైట్‌లో పొందుపరుస్తాం’ అనే సందేశాన్ని యువకుడికి పంపారు. దీంతో అనుమానించిన అతగాడు ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేసి తాను మోసపోయినట్లు గుర్తించాడు. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
ఆన్‌లైన్‌లో ఎస్కార్ట్ సర్వీస్ ప్రకటనలు
ఆకర్షితుడైన నగరానికి చెందిన యువకుడు
రిఫండ్ అంటూ ఎర వేసి ఆ మొత్తం స్వాహా
సీసీఎస్‌లో కేసు నమోదు