
ఆర్టీఏ పౌరసేవలకు సాంకేతిక చిక్కులు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏ పౌరసేవలు సాంకేతిక చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. సకాలంలో ఓటీపీలు లభించక వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. రవాణా శాఖ అందజేసే అన్ని రకాల పౌరసేవలను ఆన్‌లైన్ పరిధిలోకి తెచ్చారు. వాటిలో కొన్నింటిని నేరుగా మొబైల్ ఫోన్ నుంచే పొందే సదుపాయం ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘టీ–ఫొలియో’ మొబైల్ యాప్ ద్వారా ఈ సేవలను పొందొచ్చు. కానీ.. సాంకేతిక సమస్యలతో వాహనదారులకు ప్రత్యక్ష సేవలు లభించడం లేదు.
టీ–ఫొలియో ద్వారా 17 సేవలు
డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌లు, బదిలీలు, ఫీజులు, పన్ను చెల్లింపులు, పర్మిట్‌లు, పర్మిట్‌ల పునరుద్ధరణ వంటి సుమారు 56 రకాల పౌరసేవలను రవాణాశాఖ 2016లో ఆధునికీకరించింది. పౌరసేవలు పొందేందుకు వాహన వినియోగదారులు మొదట ఆన్‌లైన్‌లో స్లాట్ నమోదు చేసుకొని, ఫీజు చెల్లించి తర్వాత కేటాయించిన సమయానికి ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదించాలి. రవాణా కార్యకలాపాలను సరళతరం చేయడంతో పాటు పారదర్శకతను పెంచేందుకు ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మరో అడుగు ముందుకేసి వీటిలో 17 రకాల పౌరసేవల కోసం వాహనదారులు ఆర్టీఏకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మరింత సులభం చేశారు. ఇంట్లో కూర్చొని నేరుగా మొబైల్ ఫోన్ నుంచే వాటిని పొందేసదుపాయం అందుబాటులో ఉంది.
● లెర్నింగ్ లైసెన్సుల కాల పరిమితి పొడిగింపు, డ్రైవింగ్‌లైసెన్సుల పునరుద్ధరణ, వాహన రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ, డూప్లికేట్ డాక్యుమెంట్‌లను తీసుకోవడం, వాహనాలు, లైసెన్సుల చిరునామా బదిలీలు, నిరభ్యంతర పత్రాలు (ఎన్‌ఓసీలు) వంటి 17 రకాల సేవలను మొబైల్ ఫోన్ నుంచే పొందే సదుపాయం ఉంది. ఆర్టీఏ ఆఫీస్‌కు నేరుగా రాలేనివాళ్లు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నారు. గత ప్రభుత్వం అన్ని రకాల పౌరసేవల కోసం ప్రవేశపెట్టిన ‘టి–ఫొలియో’ యాప్‌తో ఈ సేవలను అనసంధానం చేసిన తర్వాతే ఆటంకాలు మొదలయ్యాయి.
జాడ లేని ఓటీపీలు
సాధారణంగా పౌరసేవను ఎంపిక చేసుకున్న వెంటనే వాహనదారుడి మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత మాత్రమే ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. సకాలంలో ఓటీపీలు లభించకపోవడంతో వినియో గదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. మరోవైపు ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత డాక్యుమెంట్‌లు డౌన్‌లోడ్ కాకపోవడం మరో సమస్య. ‘డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్స్‌లో తరచుగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. టీ–ఫొలియో యాప్‌ను ఈ సేవ కేంద్రాలు నిర్వహించడం వల్లే సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. త్వరలోనే సాంకేతిక వైఫల్యాలను అధిగమించనున్నట్లు చెప్పారు.
ఓటీపీలు అందక పడిగాపులు
తరచూ తలెత్తే సమస్యలతో తీవ్ర జాప్యం