మృత్యుపాశాలు | - | Sakshi
Sakshi News home page

మృత్యుపాశాలు

Published Mon, Apr 21 2025 1:05 PM | Last Updated on Mon, Apr 21 2025 1:05 PM

మృత్య

మృత్యుపాశాలు

సోమవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

8లోu

ప్రాణాలు తీస్తున్న విద్యుత్‌ తీగలు

గత సంవత్సరం 69 మంది మృత్యువాత

తాజాగా కొందుర్గు, శంషాబాద్‌లో విద్యుత్‌షాక్‌తో ఇద్దరి మృతి

సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నా.. చర్యలు శూన్యం

సాక్షి, రంగారెడ్డిజిల్లా: వెలుగులు పంచాల్సిన విద్యుత్‌ తీగలు.. ప్రాణాలు తోడేస్తున్నాయి.. కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగుల్చుతున్నాయి.. సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో ప్రమాదాల సంఖ్య తగ్గకపోగా మరింత పెరుగుతుండడం ఆందోళన కలిగించే పరిణామం. విద్యుత్‌షాక్‌కు గురై మృత్యువాతపడుతున్న వారిలో అధికంగా సంస్థతో సంబంధం లేని ప్రైవేటు కార్మికులు, సాధారణ ప్రజలే ఉంటుండటం విశేషం. గ్రేటర్‌ పరిధిలో గత సంవత్సరం ఏకంగా 69 మంది విద్యుదాఘాతాలతో మృత్యువాత పడటం పరిస్థితికి అద్దం పడుతోంది. ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ నెలల్లోనే అత్యధిక ప్రమాదాలు వెలుగు చూస్తుండటం గమనార్హం. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో అనేక చోట్ల ఇళ్లపైనే వైర్లు వేలాడుతున్నాయి. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలకు తెగిపడుతున్నాయి. తరచూ చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడుతున్నాయి. విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలుతున్నాయి. వాటి చుట్టూ సరైన కంచె సహా ఎర్తింగ్‌ సిస్టం సరిగా లేకపోవడంతో సాధారణ పౌరులతో పాటు మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయి.

బయటివారితో విద్యుత్‌ పనులు

మెజార్టీ సెక్షన్ల పరిధిలో అనుభవం, అర్హత ఉన్న జూనియర్‌ లైన్‌మెన్‌లకు బదులు ఎలాంటి అనుభవం, అర్హత లేని ప్రైవేటు కార్మికులతో పని చేయిస్తున్నారు. విద్యుత్‌ లైన్లపై వీరికి సరైన అవగాహన కూడా ఉండటం లేదు. లైన్ల పునరుద్ధరణ, ఇతర మరమ్మతుల సమయంలో ఎల్సీ తీసుకున్నప్పటికీ.. గృహాలు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల్లోని ఇన్వర్టర్లు/ జనరేటర్లు ఆన్‌లో ఉండటం వాటి నుంచి రివర్షన్‌లో కరెంట్‌ సరఫరా కావడం తెలిసిందే. ఈ విషయం తెలియక కార్మికులు వాటిని ముట్టుకుని ప్రమాదాల బారిన పడుతున్నారు. వాస్తవానికి స్తంభాలు ఎక్కే ముందే టంగ్‌ టెస్టర్‌తో ఎర్తింగ్‌ చెక్‌ చేయాల్సి ఉంది. కానీ కనీస భద్రతా చర్యలు తీసుకోకుండా ఏకంగా స్తంభాలు ఎక్కి సర్వీసు వైర్లు కలుపుతున్నారు. ఇప్పటి వరకు నమోదైన మృతుల్లో జేఎల్‌ఎంలు, ఆర్టిజన్లతో పాటు ప్రైవేటు కార్మికులే ఎక్కువగా ఉన్నట్లు డిస్కం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తీరా ప్రమాదాల్లో చనిపోయిన తర్వాత సంస్థ నుంచి వారికి ఎలాంటి బెన్‌ఫిట్స్‌ కూడా అందడం లేదు. కార్మికుల మృతదేహాలను సబ్‌స్టేషన్ల ముందు పెట్టి ఆందోళన చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, ప్రైవేటు కార్మికుల మరణాలకు కారణమైన సంబంధిత క్షేత్రస్థాయి అధికారులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు.

న్యూస్‌రీల్‌

భారీ ఈదురు గాలులతో కూడిన వర్షానికి ఇటీవల కొందుర్గు మండలం చిన్న ఎల్కిచర్ల శివారులోని ఓ వ్యవసాయ పొలంలో విద్యుత్‌ స్తంభం నేలకూలి, వైర్లు తెగిపడ్డాయి. పర్వతాపూర్‌కు చెందిన అశోక్‌రెడ్డి (35) అటు వైపు వెళ్లగా ప్రమాదవశాత్తు తెగిపడిన వైరు తగిలి షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. సాధారణంగా వైర్లు తెగిపడిన వెంటనే ఫీడర్‌ ట్రిప్పై సరఫరా నిలిచిపోతోంది. కానీ ఇక్కడ అలా జరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

శంషాబాద్‌ మండలం పెద్దషాపూర్‌ రైల్వేట్రాక్‌ సమీపంలోని ఓ తోటలో ఇబ్రహీంపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కె.చేతన్‌రెడ్డి(26) మామిడికాయలు కోసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ తీగలు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

గ్రేటర్‌లో విద్యుత్‌షాక్‌ మరణాలు

సర్కిల్‌ మృతులు

మేడ్చల్‌ 15

రాజేంద్రనగర్‌ 13

సైబర్‌సిటీ 12

సరూర్‌నగర్‌ 12

బంజారాహిల్స్‌ 04

హబ్సీగూడ 04

హైదరాబాద్‌ సెంట్రల్‌ 04

హైదరాబాద్‌ సౌత్‌ 03

సికింద్రాబాద్‌ 02

మృత్యుపాశాలు1
1/1

మృత్యుపాశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement