
సమస్యలకు సత్వర పరిష్కారం
కలెక్టర్ నారాయణరెడ్డి
మహేశ్వరం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతితో రైతుల భూ సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో సోమవారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణితో భూ సమస్యలు పరిష్కారం కాక రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగేవారని, భూ భారతి చట్టంతో అలాంటి అవసరం రాదన్నారు. 90 శాతం సమస్యలు స్థానికంగానే పరిష్కారం అవుతాయని, 10 శాతం మాత్రమే ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో ఉంటాయని తెలిపారు. భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు జారీ చేసే ఉత్తర్వులపై ఏవైనా అభ్యంతరాలుంటే అప్పీలు చేసుకునే అవకాశం ఉందన్నారు. భూ భారతి చట్టం ద్వారా రైతులు, పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అనంతరం రైతులు కొత్త చట్టంపై కలెక్టర్, ఆర్డీఓలను సందేహాలు అడిగి నివృత్తి చేసుకున్నారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ రైతులకు వివరించారు. కార్యక్రమంలో కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ సైదులు, మార్కెట్ కమిటీ చైర్మన్ సభావత్ కృష్ణా నాయక్, వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, ఏడీఏ సుధారాణి, ఎంపీడీఓ శైలజ, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి, జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి, మాజీ ఎంపీపీలు కోరుపోలు రఘుమారెడ్డి, సునీతా అంధ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.