
రహదారిపై విరిగిపడిన మర్రి చెట్టు
● గంటకుపైగా ట్రాఫిక్ జాం
చేవెళ్ల: గాలిదుమారంతో హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ఓ పెద్ద మర్రి చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండలంలో సోమవారం మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టింది. సాయంత్రం 4 గంటల నుంచి వాతవారణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులు, పలుచోట్ల వర్షం కురిసింది. మండలంలోని ఖానాపూర్, ఆలూరు, అంతారం, కౌకుంట్ల తదితర గ్రామాల్లో జోరు వర్షం కురిసింది. బలమైన గాలులకు అంతారం బస్‌స్టేజీ సమీపంలో ఓ పెద్ద మర్రి చెట్టు విరిగి రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో రోడ్డుపై వాహనాల సంఖ్య తక్కువగా ఉండడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రోడ్డుపై చెట్టు పడిపోవటంతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. గంటకుపైగా రాకపోకలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రోడ్డుపై పడిపోయిన చెట్టును జేసీబీల సాయంతో తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.