Hitaishi Comments On YSRCP MLC Candidates Selection In AP - Sakshi
Sakshi News home page

బలహీన వర్గాలకు బలమైన పునాది.. మార్పు గమనించారా?

Published Mon, Feb 20 2023 6:11 PM | Last Updated on Mon, Feb 20 2023 6:52 PM

Hitaishi Comments On YSRCP MLC Candidates Selection In AP - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలికి వైఎస్సార్‌సీపీ తన అభ్యర్థులను ఎంపిక చేసిన తీరు వర్తమాన రాజకీయంలో ఒక మాస్టర్ స్ట్రోక్‌లా అనిపిస్తోంది. మొత్తం 18 స్థానాలకు అభ్యర్దులను ఎంపిక చేయడం ద్వారా పార్టీ ఎంత సమర్ధవంతంగా పనిచేస్తున్నదో తెలియచేసినట్లు అయ్యింది. వర్తమాన రాజకీయాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికలలో బలహీనవర్గాలవారు పోటీ పడే పరిస్థితి తక్కువగా ఉంటోంది. పోటీ చేసినా వివిధ కారణాల వల్ల గెలవడం చాలా కష్టంగా ఉంటోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తేలికగా శాసనమండలికి ఎన్నికయ్యే రీతిలో బలహీనవర్గాలకు అవకాశం కల్పించడం విశేషం. బహుశా మొదటిసారిగా బలహీనవర్గాలకు ఈ స్థాయిలో పెద్ద పీట వేసినట్లు అవగతమవుతుంది.

ఈ ఎంపికతో వైఎస్సార్‌సీపీ బలహీనవర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదన్న సందేశాన్ని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మరోసారి పంపించారు. తద్వారా తనకు సామాజిక న్యాయం పట్ల ఎంత కమిట్మెంట్‌ ఉన్నదో తెలియచేశారు. ఒకరకంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఇది షాక్ వంటిదే. పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయాలను సమగ్రంగా వివరిస్తూ గతంలో తెలుగుదేశం హయాంలో శాసనమండలిలో సామాజికవర్గాల కూర్పు ఎలా ఉంది? తమ హయాంలో ఎలా ఉంది? ఎంత తేడా ఉన్నది వివరించారు. 

గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేవలం 37 శాతం మందికి మాత్రమే అవకాశం ఇవ్వగా, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఈ బలహీనవర్గాలకు 68 శాతం ఎమ్మెల్సీ పదవులు కేటాయించినట్లు తెలిపారు. తమది బీసీల పార్టీ అని ఆయా సందర్భాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకుంటారు. కానీ, ముఖ్యమంత్రి జగన్ అదంతా ఒట్టిదే అని నిరూపిస్తూ వెనుకబడిన వర్గాలకు అధికార వ్యవస్తలో ఎలా భాగస్వామ్యం కల్పించాలో తాను చేసి చూపించారని అనుకోవచ్చు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో బీసీలకు అవకాశాలు రాలేదనడం అతిశయోక్తి కాదు. 

అంతేకాదు.. ఇలాంటి పదవుల ఎంపికకు టీడీపీలో చివరి క్షణం వరకు కసరత్తు చేస్తున్నట్లు చంద్రబాబు కనిపించేవారు. కానీ, సీఎం జగన్ తమ పార్టీ నేతలతో సంప్రదింపులు జరపడం, ఎవరికి పదవులు ఇస్తే అటు సమాజంలో మంచి గుర్తింపు, ఇటు రాజకీయంగా ప్రయోజనం సాధించే విధంగా ముందుగానే అభ్యర్దులను ప్రకటించడం కూడా విశేషమే. తాజాగా 18 పదవులకు గాను 11 స్థానాలను బీసీలకు కేటాయించడం ఒక రికార్డే. అలాగే, మరో మూడు స్థానాలను ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చారు. నాలుగు సీట్లకు మాత్రమే అగ్రవర్ణాల వారిని ఎంపిక చేశారు. బీసీల్లో  ఎన్నడూ చట్టసభలు చూడని కులాలకు కూడా అవకాశం కల్పించారు. 

తమ జనాభా నిష్పత్తి ప్రకారం పదవులు ఇవ్వాలని బీసీలతో సహా బలహీనవర్గాలు డిమాండ్ చేస్తుంటాయి. దానిని నిజం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌దే అని చెప్పాలి. సాధారణంగా పలుకుబడి కలిగిన అగ్రవర్ణాల నేతల నుంచి చాలా ఒత్తిడి ఉంటుంది. వాటన్నింటిని తట్టుకుని ఆయన బలహీనవర్గాల వారికి పదవులు ఇవ్వడం అంటే ఒక రకంగా ధైర్యంతో కూడిన విషయమే అని చెప్పాలి. అదే సమయంలో పార్టీని నమ్ముకున్నవారికి, పార్టీని నమ్మి , ప్రతిపక్ష టీడీపీ నుంచి వచ్చిన వారికి కూడా పదవులు లభించాయి. 

ఉదాహరణకు నర్తు రామారావు, కోలా గురువులు, వంకా రవీంద్రనాథ్‌, చంద్రగిరి ఏసురత్నం, కుంభా రవి, మర్రి రాజశేఖర్ వంటి వారు గత కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. వీరిలో కొందరు 2014లో ఎన్నికలలో పోటీచేసి 2019లో పార్టీ సూచన ప్రకారం పోటీ నుంచి తప్పుకుని వేరే వారికి అవకాశం ఇచ్చారు. ఇలాంటి పలువురికి కార్పోరేషన్ పదవులు ఇచ్చినా, తిరిగి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం ద్వారా జగన్ మాట తప్పరని రుజువు చేసుకున్నారు. విధేయతకు ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసినట్లయింది. మర్రి రాజశేఖర్‌కు పదవి ఇవ్వడంలో కొంత జాప్యం అయినా, పార్టీపరంగా బాధ్యతలు ఇస్తూ వచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇచ్చారు.

రెడ్డి, కమ్మ, కాపు, క్షత్రియ వర్గాల నుంచి ఒక్కొక్కరికే ఈసారి ఛాన్స్ వచ్చింది. ఎన్నికల సంవత్సరం కావడం, బలహీనవర్గాలు సీఎం జగన్‌కు పెద్ద అండగా ఉన్న నేపథ్యంలో వారికే ప్రాధాన్యం ఇవ్వాలని భావించారు. వేరే పార్టీ నుంచి వచ్చిన రామసుబ్బారెడ్డి, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణలకు హామీ ప్రకారం పదవులు లభించాయి. వీరిలో వెంకటరమణ అదృష్టవంతుడని చెప్పాలి. వడ్డీ కులానికి చెందిన ఈయన కైకలూరు ప్రాంతంలో బలమైన నేతగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే పార్టీలోకి వచ్చారు. అయినా చెప్పిన విధంగా ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కేటాయించారు. శెట్టి బలిజ వర్గానికి చెందిన ఇద్దరికి కవురు శ్రీనివాస్, కుడిపూడి సూర్యనారాయణ.. వీరిద్దరూ పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ  జిల్లాలకు చెందినవారు కావడం విశేషం. .

అలాగే అంబేద్కర్ జిల్లాకే చెందిన ఒక ఎస్సీ నేతకు, పశ్చిమగోదావరి నుంచి ఒక కాపు నేతకు పదవులు ఇచ్చారు. అలాగే మత్య్సకార వర్గానికి చెందిన ఇద్దరికి కోలా గురువులు, కర్రి పద్మశ్రీలకు పదవులు దక్కాయి. ఇది కూడా వ్యూహాత్మకంగానే కనిపిస్తుంది. ఇప్పటికే మండలి చైర్మన్ పదవి ఎస్సీకి, డిప్యూటీ ఛైర్మన్ పదవిని మైనార్టీకి కేటాయించడం, ఇప్పడు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం గమనించవలసిన అంశం. 

జమ్మలమడుగులో బలమైన నేతగా ఉన్న రామసుబ్బారెడ్డికి , అలాగే టీడీపీ నుంచి గత ఎన్నికలలో గెలుపొందిన మద్దాలి గిరిధర్‌కు సీటు కేటాయించడం కోసం ఇంతకు ముందు పోటీచేసి ఓడిపోయిన చంద్రగిరి ఏసురత్నానికి ముందుగానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చేస్తున్నారు. ఈ రకంగా వ్యూహాత్మకంగా సీఎం జగన్ అడుగులు వేశారు. మార్చి ఆఖరు నాటికి శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ సంఖ్య మూడింట రెండువంతులకు పైనే ఉండబోతోంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మరింతగా క్షీణించబోతోంది. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనమండలిలో టీడీపీ  ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. 

శాసనమండలిలో కొంతకాలం క్రితం టీడీపీకి మెజార్టీ ఉండేది. దానిని అడ్డు పెట్టుకుని మూడు రాజధానుల బిల్లుతో సహా పలు బిల్లులను  పాస్ కానివ్వకుండా చేసేది. చివరికి బడ్జెట్‌కు కూడా ఆటంకం కల్పించింది. ఆ సమయంలో విసుగు చెందిన వైఎస్సార్‌సీపీ మండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. కానీ, ఆ తర్వాత వైఎస్సార్‌సీపీకి మెజార్టీ వచ్చింది. దానిని దృష్టిలో ఉంచుకుని ఆ తీర్మానాన్ని విరమించుకుని, ఆ పదవుల ద్వారా సామాజిక న్యాయం చేయడానికి సీఎం జగన్ సంకల్పించారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఈ సంచలన ఎంపిక  వచ్చే శాసనసభ ఎన్నికలలో విజయానికి సోపానం అవుతుందంటే అతిశయోక్తి కాదు. 

- హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement