Oscars 2022: ఆస్కార్‌.. వచ్చినా ఏం లాభం? | Oscar Awards 2022: Academy Awards History Interesting Facts | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌.. వచ్చినా ఏం లాభం? అమ్మితే ఒక్క డాలరే!!

Published Sat, Mar 26 2022 4:53 PM | Last Updated on Sat, Mar 26 2022 5:24 PM

Oscar Awards 2022: Academy Awards History Interesting Facts - Sakshi

Oscar Trophy Birth And Intresting Facts: సినీ జగత్‌కు పెద్ద పండుగ ‘ఆస్కార్‌’ కౌంట్‌ డౌన్‌కి మరొక రోజే మిగిలి ఉంది. ఫైనల్ నామినేషన్ల లిస్ట్ బయటకు వచ్చినప్పటి నుంచి విజేతల గురించి మూవీ లవర్స్‌ జోరుగా చర్చించుకుంటున్నారు. కరోనా జోరు తగ్గడంతో ఈసారి కాస్త హడావిడిగానే ఈవెంట్‌ను జరపాలని అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్ సైన్సెన్స్‌(ఎఎంపీఏఎస్‌) నిర్ణయించుకుంది. ఇంతకీ ఆస్కార్‌ వస్తే ఏం లాభం? నటులకు, టెక్నిషీయన్లకు అంతగా ఏం ఒరుగుతుంది?.. 

ఆస్కార్‌ అవార్డులకు ప్రామాణికం.. వేడుకల్లో అందించే ట్రోఫీ. ఈ ట్రోఫీకి చాలా చరిత్రే ఉంది. ఈ గోల్డెన్‌ స్టాచ్యూ ట్రోఫీని ‘అకాడమీ అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్’ అంటారు.  ఫ్రాన్స్‌కి చెందిన డెకో స్టయిలో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. అమెరికా డిజైనర్ కెడ్రిక్‌ గిబ్సన్‌ ఈ ట్రోఫీ డిజైన్‌ను స్కెచ్ చేయగా, ఐరిష్‌ ఆర్ట్ డైరెక్టర్‌ జార్జ్‌ స్టాన్లీ ఆస్కార్‌ ట్రోఫీ బొమ్మను తయారు చేశాడు.  ఈ బొమ్మను కంచుతో తయారు చేస్తారు. పైన బంగారు పూత పూస్తారు. ఒక్కో విగ్రహం తయారీకి ఐదు నుంచి 900ల డాలర్ల ఖర్చు అవుతుంది. యాభై విగ్రహాల తయారీకి మూడు నెలల టైం పడుతుంది.  ట్రోఫీ పొడవు 34 సెంటిమీటర్లు, బరువు మూడున్నర కేజీలు ఉంటుంది.  1929 నుంచి ఇప్పటిదాకా 3,160 ట్రోఫీలను ఇచ్చింది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌.  కానీ, సినిమావాళ్లు గొప్పగా భావించే ఈ ట్రోఫీని.. ఒకవేళ అమ్మితే వచ్చేది మాత్రం కేవలం ఒక్క డాలర్‌!. 


2021 ఆస్కార్‌ విజేతలు

కోర్టుకెక్కి మరీ
1950కి ముందుదాకా.. అవార్డు గెల్చుకున్నవాళ్లకే ట్రోఫీపై అన్ని హక్కులు ఉండేవి. ఆ తర్వాత అకాడమీ తన రూల్స్‌ సవరించింది.  విజేతలు ఎవరైనా సరే ఆస్కార్‌ ట్రోఫీని.. వేరే వాళ్లకు అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ అమ్మాలంటే.. అకాడమీకే అమ్మాలని ముందుగానే కాంట్రాక్ట్ మీద విజేతలతో సైన్‌ చేయించుకుంటారు.  అలా అమ్మేయగా ఒక్కటంటే ఒక్క డాలర్ మాత్రమే ఇస్తారు. ఒప్పందాన్ని కాదని వేరేవాళ్లకు అమ్మితే.. కోర్టుకు ఇడుస్తుంది అకాడమీ. అయినప్పటికీ కొందరు ట్రోఫీలను అమ్మడం విశేషం.  

‘ఎరౌండ్ ది వరల్డ్ ఇన్‌ 80 డేస్’(1956) బెస్ట్‌ మూవీగా ఆస్కార్‌ ట్రోఫీ గెల్చుకుంది. ఈ మూవీ ప్రొడ్యూసర్‌ మైకేల్ టాడ్స్‌. ఈయన మనవడు 1989లో ట్రోఫీని వేలం వేయాలని ప్రయత్నించాడు.  కోర్టులో కేసు వేసి ఆ వేలంపాటను అకాడమీ అడ్డుకుంది.  1992లో ‘బెస్ట్ సపోర్ట్ యాక్టర్’ ట్రోఫీ గెల్చుకున్న హరోల్డ్‌ రస్సెస్‌..  తన భార్య ఆరోగ్యం కోసం అరవై వేల డాలర్లకు ఆస్కార్‌ ట్రోఫీని అమ్మేశాడు. ఈ విషయంలో అకాడమీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే తన భార్య ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని పోరాడి మరీ కేసు గెలిచాడు హరోల్డ్‌. 

హాలీవుడ్ కల్ట్‌ క్లాసిక్‌ ‘సిటిజన్ కేన్‌’(1941) ఒరిజినల్ స్క్రీన్‌ప్లే కేటగిరీలో ఆస్కార్ గెల్చుకుంది. స్క్రీన్‌ప్లే రైటర్‌ ఓర్సన్‌ వెల్స్‌ వారసులు ఆ ట్రోఫీని వేలం అమ్మేయాలని ప్రయత్నించారు. ఈ కేసు కోర్టులో నడిచినప్పటికీ.. వెల్స్‌ వారసులే కేసు నెగ్గారు.  ఆ టైంలో అకాడమీ కాంట్రాక్ట్‌లో వెల్స్‌ సైన్‌ చేయకపోవడం ఆ వారసులకు కలిసొచ్చింది.  కోర్టు తీర్పు తర్వాత 2011లో ఆ ట్రోఫీని వేలం వేయగా..  ఎనిమిదిన్నర లక్షల డాలర్లు వచ్చింది. 

ఇంత సమస్యలున్నప్పుడు..  అసలు ఆస్కార్ ట్రోఫీ గెలవడం వల్ల లాభం ఏంటంటారా?. ఆర్టిస్టులు, ఇతర టెక్నిషియలు తమ రెమ్యునరేషన్‌ పెంచుకోవడం కోసం, తమ బ్రాండ్‌లను మార్కెటింగ్ చేసుకోవడం కోసమే పనికొస్తుంది.  అన్నింటికి మించి సినీ ప్రపంచంలో ఇదొక ఔనత్యమైన అవార్డు అనే గుర్తింపు దక్కుతుంది కదా!.

ఆస్కార్‌పై కథలు
1939 వరకు అకాడమీ అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్ అనే ట్రోఫీని పిలిచేవాళ్లు. ఆ తర్వాత అఫీషియల్‌గా ‘ఆస్కార్‌’ అనే ముద్దుపేరుతో పిలుస్తున్నారు.  ఆ పేరు అసలు ఎలా వచ్చిందనే దానిపై రకరకాల కథలు వినిపిస్తుంటాయి. అమెరికన్ నటి బెట్టె డేవిస్‌ అప్పట్లో అకాడమీ ఆర్గనైజేషన్‌కి ప్రెసిడెంట్‌ పని చేసింది. తన మొదటి భర్త పేరు హర్మన్‌ ఆస్కార్‌ నెల్సన్‌. ఆయన పేరు మీదుగా ఆమె ట్రోఫీలకు ఆ పేరు పెట్టిందని చెప్తారు. మరో వెర్షన్‌ ఏంటంటే..  హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మార్గరెట్‌ హెర్రిక్‌, ఆ బొమ్మ రూపం తన అంకుల్‌ ఆస్కార్‌ని పోలి ఉండడంతో ఆమె ఆ పేరు పెట్టించిందని చెప్తారు.

అమెరికన్‌ కాలమిస్ట్‌ సిడ్నీ స్కోలిస్కై మాత్రం తన కాలమ్‌లో ‘అకాడమీ ఎంప్లాయిస్‌ ముద్దుగా ఆ పేరు పెట్టుకున్నార’ని రాశాడు.  అయితే 1934లో ట్రోఫీ అందుకున్న తర్వాత ప్రముఖ ప్రొడ్యూసర్‌ వాల్టర్‌ ఎలియాస్‌ డిస్నీ(వాల్ట్‌ డిస్నీ)  ఫస్ట్ టైం ‘ఆస్కార్‌’ అనే పదాన్ని స్టేజ్‌ మీద ఉపయోగించడం కొసమెరుపు. అకాడమీ మోషన్‌ పిక్చర్స్‌ అవార్డులకు ‘ఆస్కార్‌’ అనే ట్రేడ్‌ మార్క్‌ ఉంది. అయితే ఇటలీలో ఏ రంగంలో అవార్డులు ఇచ్చినా ఆస్కార్‌ అనే పిలుస్తుంటారు.    

2020.. వరస్ట్‌!
1930లో ఆస్కార్‌ వేడుకల ఈవెంట్‌ను రేడియోలో బ్రాడ్‌కాస్ట్ చేశారు. 1953 నుంచి టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే ఆర్కీవ్స్ మాత్రం 1949 నుంచి భద్రపరుస్తున్నారు. రీల్‌, వీడియో, డిజిటల్ కాపీలుగా వాటిని భద్రపరిచారు.  వేదికలు.. మారుతూ వస్తున్నాయి. కొడాక్‌ థియేటర్‌.. డాల్బీ థియేట్‌లో జరుగుతున్నాయి.  అయితే 2018లో ఈవెంట్‌ను టెలికాస్ట్ చేయలేదు. కొన్ని ఆస్కార్‌ వేడుకల్లో.. బ్రేక్‌ టైంలో అవార్డులూ ఇచ్చారు. కొత్తగా కొన్ని కేటగిరీలను కలిపారు. రాను రాను కొన్ని కేటగిరీలను ఎత్తేశారు. వీటిపై విమర్శలు వచ్చాయి. అయినా అకాడమీ తగ్గడం లేదు. 


1998 ఆస్కార్‌ విజేతలు

అంతకు ముందు ఆస్కార్‌ అవార్డుల నామినేషన్ల ఫలితాల్ని ఫిబ్రవరి మొదటి వారంలో అనౌన్స్‌ చేసేవాళ్లు. 2004 నుంచి అకాడమీ అవార్డుల నామినేషన్‌ ఫలితాల్ని జనవరి మధ్యలోనే ప్రకటిస్తున్నారు. ఆస్కార్‌ వేడుకల టెలికాస్టింగ్‌కు సంబంధించి.. 1980 నుంచి టీఆర్పీని లెక్కిస్తున్నారు. హయ్యెస్ట్ టీఆర్పీ 1998లో వచ్చింది. 57 టీఆర్పీతో అస్కార్‌ చరిత్రలోనే రికార్డ్‌ నెలకొల్పింది. మరి లోయెస్ట్ టీఆర్ఫీ అంటారా? అది.. 2020లోనే రికార్డయ్యింది.

ఫస్ట్‌ .. రీసెంట్‌
ప్రపంచంలోనే చాలాకాలం నుంచి జరుగుతున్న ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డుల ఈవెంట్‌.. ఈ ‘అకాడమీ’(ఆస్కార్‌) అవార్డులు.  మొదటి వేడుక ఎలాంటి ఆర్భాటాలు లేకుండా జరిగింది. 1929, మే 16న లాస్‌ ఏంజెలెస్‌లోని హాలీవుడ్‌ రూజ్‌వెల్ట్‌ హోటల్‌లో ప్రైవేట్ డిన్నర్‌ ఫంక్షన్‌ ఏర్పాటు చేసి అవార్డులను ఇచ్చారు. ఈ ఈవెంట్‌కు 270 మంది హాజరయ్యారు. అమెరికన్‌ యాక్టర్‌ డగ్లస్‌ ఫెయిర్‌బ్యాంక్‌ ఈ వేడుకలకు హోస్ట్‌గా వ్యవహరించాడు. 1927–28 మధ్య రిలీజ్‌ అయిన సినిమాలకు ఈ అవార్డులు దక్కాయి. అయితే ఈవెంట్‌ను కేవలం పదిహేను నిమిషాల్లోనే ముగించారు. మొత్తం పదిహేను ట్రోఫీలను ఇచ్చారు. మొదటి ఈవెంట్‌లో  గెలిచినవాళ్ల పేర్లను మూడు నెలల ముందే మీడియాకు రిలీజ్ చేయడం విశేషం. ఈ రూల్‌ను రెండో ఆస్కార్‌ వేడుకలకు(1930) మార్చేశారు.


అకాడమీ అవార్డుల మొదటి వేడుక

అవార్డులిచ్చే రాత్రి విన్నర్ల పేర్ల లిస్ట్‌ను పేపర్‌ హౌజ్‌లకు పంపించేవాళ్లు. 1940 వరకు ఇదే జరిగింది. అయితే లాస్‌ఏంజెలెస్‌ టైమ్స్‌ వాళ్లు సరిగ్గా అవార్డు వేడుక జరిగే ముందే పేర్లను అనౌన్స్‌ చేసేది. ఇది చూసి అకాడమీ వాళ్లు సీల్డ్ కవలర్‌లో విన్నర్స్‌ను అనౌన్స్‌ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు జరగబోయే అవార్డుల వేడుక 94వది. మార్చి 27న 2022న కాలిఫోర్నియా లాస్‌ ఏంజెల్స్‌ డాల్బీ థియేటర్‌లో జరుగనుంది. భారత కాలమానం ప్రకారం.. మార్చి 28 సోమవారం ఉదయం ఐదుగంటలకు ఈ ఈవెంట్‌ మొదలవుతుంది. Disney+Hotstar App ద్వారా మన దేశంలో ఆస్కార్‌ వేడుకల్ని లైవ్‌గా వీక్షించొచ్చు.

:::సాక్షి వెబ్‌డెస్క్‌ ప్రత్యేకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement