Russia Ukraine War: Heart Touching Images And Videos Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Russia Ukraine War: యుద్ధం ముగుస్తుంది.. నిజంగానే యుద్ధం ముగుస్తుంది.. కానీ!

Published Fri, Feb 25 2022 5:15 PM | Last Updated on Wed, Mar 2 2022 6:53 PM

Russia Ukraine Crisis: Heart Melting Videos Pictures Goes Viral - Sakshi

గుండెను ముక్కలు చేస్తున్న హృదయ విదారక దృశ్యాలు

Russia Ukraine Crisis:‘యుద్ధం ముగుస్తుంది. నాయకులు చేతులు కలుపుకొంటారు. ఓ వృద్ధురాలైన తల్లి అమరుడైన తన కొడుకు కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. ఓ అమ్మాయి తన ప్రియమైన భర్త రాక కోసం వేచి ఉంటుంది. వీరుడైన తమ తండ్రి వస్తాడని ఎదురుచూస్తూనే ఉంటారు పిల్లలు. మా మాతృదేశాన్ని ఎవరు అమ్మేశారో తెలియదు కానీ... అందుకు మూల్యం ఎవరు చెల్లిస్తున్నారో మాత్రం నేను చూడగలుగుతున్నా’’- బాధతో హృదయం ద్రవించిన ఓ కవి ఆవేదన ఇది. యుద్ధం తాలూకు అనుభవాలు చూసిన ఆయన హృదయ వేదనకు అక్షరరూపం.

యుద్ధం అంటే రక్తపాతం.. యుద్ధం అంటే అశాంతి.. యుద్దం అంటే నొప్పి.. అవును యుద్ధం ఎందుకు వస్తుంది? ఆధిపత్య ధోరణి.. ఏకపక్ష నిర్ణయాలు.. స్వార్థ ప్రయోజనాలు.. విస్తరణ కాంక్ష... నియంతృత్వ పోకడ.. నా మాటే చెల్లాలన్న అహంకార భావజాలం.. కారణమేదైనా.. దానిని సమర్థించుకునేందుకు ఎన్ని సాకులు ఉన్నా... బలైపోయేది సైనికులు, సామాన్య ప్రజలే! 

దేశాన్ని కాపాడుకునే క్రమంలో యుద్ధానికి బయల్దేరిన తండ్రి తిరిగి వస్తాడో లేదో ఆ చిన్నారికి తెలియదు.. తనను వదిలివెళ్తుంటే వెక్కివెక్కి ఏడ్వడం తప్ప!


మనసిచ్చిన నెచ్చెలికి తెలియదు తనవాడిని మళ్లీ చూస్తుందో లేదోనన్న విషయం.. అతడిని ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం తప్ప!

అప్పుడే పుట్టిన పసివాళ్లకు తెలియదు బయట నిప్పుల వర్షం కురుస్తోందని.. తల్లి తమను పొదివిపట్టుకున్న స్పర్శ తప్ప!

80 ఏళ్ల వృద్ధుడికి తెలియదు తను సమిధనవుతానో లేదంటే.. బతికిబట్టకట్టగలనో.. కేవలం తన మనవళ్ల కోసం యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధం కావడం తప్ప!

తల్లి కళ్ల ముందే చనిపోయినా.. దూరంగా ఉన్న తండ్రికి ఆ విషయం ఎలా చెప్పాలో తెలియదు ఓ అమ్మాయికి.. నిప్పుల వర్షాన్ని తలచుకుని బిక్కుబిక్కుమంటూ గడపడం తప్ప!
తండ్రి, కొడుకు, భర్త ఒక్కసారిగా చచ్చిపడిపోతే కుప్పకూలిన ఆ మహిళకు తెలియదు.. తాను మాత్రం ఎందుకు బతికిఉన్నానని గుండెపగిలేలా రోదించడం తప్ప!
సురక్షితంగా బయటపడ్డ ఆ తల్లికి తెలియదు.. తన పక్కనే నిద్రపోతున్న కూతుర్ని చూసి సంతోషించడం.. తమలాగే మిగిలిన వాళ్లు బయటపడాలని ప్రార్థించడం తప్ప!

ఎక్కడికి, ఎందుకు ఇంత హడావుడిగా తరలివెళ్లిపోతున్నామో మూగ జీవాలకు తెలియదు.. తమ యజమానులు బాగుంటే చాలనే విశ్వాసం ప్రదర్శించడం తప్ప!

ఇవన్నీ ఉక్రెయిన్‌పై రష్యా ప్రకటించిన యుద్ధంలో ఆవిష్కృతమైన, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న హృదయ విదారక దృశ్యాలు. 1990ల తర్వాత యూరప్‌ చూడని యుద్ధానికి నాంది పలికింది రష్యా. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో)లో ఉక్రెయిన్‌ చేరుతుందనే సందేహం రక్తపాతానికి ఆజ్యం పోసింది. వెరసి ప్రపంచం మూడు ముక్కలైంది.

ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవడం తమ ఉద్దేశం కాదని, ఆయుధాలు వదిలి లొంగిపోతే చర్చలకు సిద్ధమని చెబుతున్నా.. అందుకు బాధిత దేశం అంగీకరించినా.. జరిగిన నష్టాన్ని పూడ్చేదెవరు? విచ్చిన్నమైన కుటుంబాలను ఒక్కటి చేసేదెవరు? శాశ్వతంగా అనాథలుగా మిగిలిపోయిన వారు కోల్పోయిన బంధాలను తిరిగి తెచ్చేదెవరు?

నిజంగానే యుద్ధం ముగుస్తుందా.. ముగిస్తే మంచిది.. తండ్రి కోసం ఎదురుచూస్తున్న చిన్నారి, కొడుకు కోసం ఎదురుచూస్తున్న తల్లి నిరీక్షణ ఫలిస్తే ఇంకా మంచిది.. అప్పుడే పుట్టిన బిడ్డలు స్వేచ్ఛ, స్వచ్ఛ వాయువులు పీల్చుకునే పరిస్థితి నెలకొంటే మరీ మంచిది...! ఇక ముందు శాంతియుతంగానే ముందుకు సాగుతామని యుద్ధం ప్రకటించిన ‘నేత’ ప్రకటన చేస్తే మరీ మరీ మంచిది!!

చదవండి: Russia Ukraine War: రష్యా టార్గెట్‌ అదే! ఉక్రెయిన్‌ ప్రజలకు క్షమాపణలు.. కన్నీటి పర్యంతమైన జెలెన్‌ స్కీ

-సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్ డెస్క్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement