Ukraine President Volodymyr Zelensky Wife And Children: ‘‘నన్ను చంపడమే రష్యా తొలి టార్గెట్. ఆ తర్వాత నా కుటుంబాన్ని అంతమొందించడం రెండో టార్గెట్..’’ అంటూ జెలెన్‌స్కీ కన్నీటి పర్యంతమయ్యారు. కేవలం ఆయన మాత్రమే కాదు కుటుంబాన్ని ప్రేమించే వారెవరైనా ఇలాంటి భావోద్వేగాలకు గురికావడం సహజం.
అధ్యక్షుడిగా దేశ ప్రజలను రక్షించుకోవడం ఎంత ముఖ్యమో.. భర్తగా, తండ్రిగా తన కుటుంబాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం! అందుకే తన వాళ్లకు ఏమవుతుందోనన్న ఆవేదన కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చింది.
అందమైన పర్యాటక ప్రాంతాలు.. విద్యార్థులు ముఖ్యంగా వైద్య విద్యనభ్యసించాలనుకున్న వాళ్లకు గమ్యస్థానం ఉక్రెయిన్.. రమారమి 4.4 కోట్ల జనాభా కలిగి ఉన్న ఈ దేశానికి 44 ఏళ్ల వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆరో అధ్యక్షుడు. విస్తీర్ణపరంగా యూరప్‌లో రెండో అతిపెద్ద దేశానికి ప్రెసిడెంట్.
కమెడియన్ స్థాయి నుంచి అత్యున్నత పదవి స్థాయికి ఎదిగి తానేంటో నిరూపించుకున్నారు. 2019లో ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. కష్టమని తెలిసినా తమ కంటే ఎన్నో రెట్లు బలశాలి అయిన రష్యాతో ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచ దేశాలు తమకు అండగా ఉంటాయన్న ధీమాతో బరిలోకి దిగిన ఆయనకు ఆశించిన మేర సహాయసహకారాలు అందలేదు.
దీంతో ఒక్కసారిగా ఘొల్లుమన్నారు జెలెన్‌స్కీ. దేశ ప్రజలను క్షమాపణ కోరుతూ ఓ వీడియో విడుదల చేసిన ఆయన.. రష్యా తొలుత తనను, తర్వాత తన కుటుంబాన్ని అంతమొందిస్తుందని కన్నీళ్లు పెట్టుకున్నారు.
ముచ్చటైన కుటుంబం..
తన చిన్ననాటి స్నేహితురాలు, క్లాస్‌మేట్ అయిన ఒలీనా కియాష్కోను జెలెన్‌స్కీ 2003లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఓలీనా వొలొదిమిరివ్నా జెలెన్‌స్కా అయ్యారు. ఒలీనా సివిల్ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. వృత్తిరీత్యా ఆమె ఓ ఆర్కిటెక్ట్. అంతేకాదు స్క్రీన్ రైటర్ కూడా!
అదే విధంగా సామాజిక కార్యకర్తగా కూడా పేరు తెచ్చుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో తన సేవా కార్యక్రమాలతో ప్రజల మనసు గెలుచుకున్నారు. కాగా కెరీర్‌పరంగా ఇబ్బందుల్లో ఉన్నపుడే ఆమె జెలెన్‌స్కీని వివాహమాడారు. ఈ క్రమంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఒలీనా 2019లో ఫోకస్ మ్యాగజీన్ అత్యంత ప్రభావంతమైన వంద మంది ఉక్రెయిన్ వ్యక్తుల్లో 30వ స్థానంలో నిలిచారు.
వాళ్లు ఇద్దరు.. వాళ్లకిద్దరు
జెలెన్‌స్కీ- ఒలీనా దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు అలెగ్జాండ్రా(17), కుమారుడు కిరిల్లో. కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే జెలెన్‌స్కీ ప్రత్యేక సందర్భాల్లో భార్యాపిల్లలతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు.
ఇందులో భాగంగా గతేడాది మే 20న ఎంబ్రాయిడరీ డే సందర్భరంగా భార్యతో దిగిన అందమైన ఫొటోను షేర్ చేశారు. గతంలో భార్యాపిల్లలతో ఆనందంగా గడుపుతున్న ఫొటోను కూడా పంచుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జెలెన్‌స్కీ.. యుద్ధం నేపథ్యంలో ఎప్పటికప్పుడు తన అప్‌డేట్లను షేర్ చేస్తున్నారు. ఆయన దేశం విడిచిపారిపోయారన్న వార్తల నేపథ్యంలో ఇవన్నీ వట్టి పుకార్లేనంటూ కొట్టిసారేస్తూ శనివారం ఓ వీడియో పోస్ట్ చేశారు.
చదవండి: Russia Ukraine War: యుద్ధం ముగుస్తుంది.. నిజంగానే యుద్ధం ముగుస్తుంది.. కానీ!
Putin: ఉక్రెయిన్‌పై వార్.. పుతిన్‌కు ఊహించని షాక్
Comments
Please login to add a commentAdd a comment