పొలిటికల్ రివ్యూ: 2022లో చేయి కాలిందా? పట్టు జారిందా? | Special Story Political Situation Of Congress Party In 2022 Roundup | Sakshi
Sakshi News home page

పొలిటికల్ రివ్యూ: 2022లో చేయి కాలిందా? పట్టు జారిందా?

Published Sun, Jan 1 2023 5:04 PM | Last Updated on Sun, Jan 1 2023 5:12 PM

Special Story Political Situation Of Congress Party In 2022 Roundup - Sakshi

2022లో కాంగ్రెస్ పార్టీ మరి కొంచెం పతనమైంది. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీని అపజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. రెండు మూడు మినహా చెప్పుకోదగ్గ రాష్ట్రాల్లో అధికారం లేదు. మూడేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంది. చాలాకాలం తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడు ఎన్నికయ్యారు. గాంధీ కుటుంబ సభ్యులు మాత్రం ఈడీ ఆఫీస్ చుట్టూ తిరిగారు. ఈ ఏడాది ఒక రాష్ట్రంలో అధికారం పోగొట్టుకుని..మరో రాష్ట్రంలో అధికారం సాధించుకుంది.

ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కి 
2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుస వైఫల్యాలు, అంతర్గత కుమ్ములాటలు, కీలక నేతలు పార్టీకి గుడ్బై చెప్పడంతో మరింత కుదేలైన హస్తం శ్రేణుల్లో.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాస్త జోష్ నింపింది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీని.. 2022లోనూ వైఫల్యాలు వెంటాడాయి. ఈ ఏడాది ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అధికారంలో ఉన్న పంజాబ్‌ను కోల్పోయింది. బీజేపీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌ను గెలుచుకుంది. మిగిలిన ఐదు రాష్ట్రాల్లో బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకుంది. గుజరాత్‌లో అయితే ఏడవసారి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది హస్తం పార్టీ. ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టి తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు బీహార్‌లో బీజేపీ కూటమిలో ఉన్న నితీష్ కుమార్ కమలానికి టాటా చెప్పి.. కాంగ్రెస్ కూటమిలో చేరారు. ఆ విధంగా మహారాష్ట్ర చేజారితే.. బీహార్‌ కూటమి ప్రభుత్వంలో కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ. 

రాహుల్ పోయే.. ఖర్గే వచ్చే
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీకి అధ్యక్షుడే లేకుండా మూడున్నరేళ్ళ పాటు సాగింది. సోనియా గాంధీ ఆరోగ్యం బాగా లేకపోయినా తాత్కాలికంగా పార్టీ బాధ్యతలు నిర్వహించారు. అధ్యక్ష ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడానికి ప్రక్రియ కొనసాగుతున్న దశలో రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. 22 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీకి మరోసారి గాంధీయేతర కుటుంబం నుంచి ఓ నేత అధ్యక్షుడయ్యారు. కర్నాటకకు చెందిన 80 ఏళ్ళ మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కొత్త నాయకుడు వచ్చినా.. పార్టీ పరిస్థితుల్లో మార్పులేదు, అధికారంలో ఉన్న రాజస్థాన్ నుంచి అధికారం పోగొట్టుకున్న తెలంగాణ వరకూ అన్ని రాష్ట్రాల్లోనూ అంతర్గత కుమ్ములాటలే. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి గెహ్లాట్, యువనేత పైలట్ వర్గాలు బహిరంగంగా మాటల తూటాలు విసురుకుంటున్నా ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో కాంగ్రెస్ హైకమాండ్ అల్లాడుతోంది. 

పార్టీని వెంటాడుతున్న పాపాలు
ఓవైపు కాంగ్రెస్ పార్టీని కష్టాలు వెంటాడుతుంటే.. మరోవైపు నేషనల్ హెరాల్ట్ కేసు గాంధీ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. తొలిసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ. సోనియాను మూడుసార్లు, రాహుల్ గాంధీని ఐదు రోజులు విచారించారు ఈడీ అధికారులు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులతో.. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఉన్న లింకులపై ఆరా తీశారు. గాంధీలు విచారణకు హాజరైన అన్ని రోజులు దేశవ్యాప్తంగా ఆందోళనలు, హర్తాళ్లు చేపట్టారు కాంగ్రెస్ శ్రేణులు. ఢిల్లీలో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సోనియా గాంధీ విచారణ నేపథ్యంలో రోడ్డెక్కిన రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

జోడో.. తెచ్చే మార్పు ఎంత?
చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టున్న కాంగ్రెస్ శ్రేణులను ఏకం చేసేందుకు, పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు..సెప్టెంబర్‌లో భారత్ జోడో యాత్ర ప్రారంభించారు రాహుల్ గాంధీ. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,570 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగేలా ప్లాన్ చేశారు. కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర.. తొమ్మిది రాష్ట్రాలు దాటుకుని..ప్రస్తుతం ఢిల్లీ చేరుకుంది. బీజేపీ విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ఐక్యత కోసమే భారత్ జోడో అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీలో నెలకొన్న విపరీత పరిస్థితులు.. నేతల మధ్య అంతరాలను తొలగించి, కాంగ్రెస్‌ను తిరిగి ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నారు రాహుల్. ఒకవైపు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా రాహుల్ గాంధీ వాటి గురించి సీరియస్‌గా తీసుకోకుండా తన జోడో యాత్ర కొనసాగించడంపై విమర్శలు వినిపించాయి.

ముందుంది ముసళ్ల పండగ
వరుజ పరాజయాలు..అంతర్గత కుమ్ములాటలతో నిస్తేజంగా మారిన కాంగ్రెస్ పార్టీలో భారత్ జోడో యాత్ర కాస్త ఉత్సాహం నింపింది. జనంలో ఉండేందుకు..ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు రాహుల్ గాంధీకి అవకాశం దక్కింది. అయితే రాహుల్ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల లబ్ధి మాత్రం ప్రశ్నార్థకమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు 2023లో కీలకమైన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనుంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ పాటు ఖర్గే సొంత రాష్ట్రం కర్నాటక సహా 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రభావం ఆయా రాష్ట్రాల్లో ఏమేరకు ఉందో..త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు తేల్చేయనున్నాయి. కొండ లాంటి బీజేపీ, బలమైన ప్రాంతీయ పార్టీలతోపాటు కాంగ్రెస్‌కు అతిపెద్ద సవాల్‌గా మారింది ఆమ్ ఆద్మీ పార్టీ. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కాంగ్రెస్ నుంచి పంజాబ్‌ను చేజిక్కించుకున్నారు. గుజరాత్‌లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును అడ్డంగా చీల్చేశారు. ముందు ముందు ఆప్ వల్ల కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం జరుగుతుందనే అంచనాలు కాంగ్రెస్ హైకమాండ్‌ను కంగారు పెడుతున్నాయి. 

పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement