
బీహె చ్‌ఈఎల్ కాలనీలో ఇలా కుక్కల సంచారం
ఏ వీధిలో చూసినా గుంపులు గుంపులుగా స్వైరవిహారం 14 నెలల్లో 453 మంది బాధితులు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): రామచంద్రాపురం, భారతీనగర్, బీహెచ్‌ఈఎల్ పరిధిలోని ఏ కాలనీ.. ఏ వీధి చూసినా కుక్కలు గుంపులుగుంపులుగా కనిపిస్తున్నాయి. సగటున నెలకు 30మంది దాకా కుక్కకాటు బారిన పడుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గతంతో పోల్చుకుంటే రాత్రివేళ కుక్కల స్వైరవిహారం మరీ ఎక్కువైంది. రాత్రయిందంటే బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఒక్క రామచంద్రాపురం ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో జనవరి 2022 నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు 453 మంది కుక్కకాటుకు సంబంధించిన ఇంజెక్షన్లు వేయించుకున్నారు. వీరేకాకుండా ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించినవారూ ఉంటారు.
పలు మాంసం దుకాణాల వద్ద మటన్‌కు సంబంధించిన వ్యర్థాలను వీధి కుక్కలకు వేస్తున్నారు. దీంతో ఆ పరిసరాల్లో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగింది.
నగరంలోని వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న కుక్కలను రాత్రివేళ తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తున్నారు. దీంతో ఆర్‌సీపురం పరిధిలో కుక్కల సంఖ్య పెరిగింది. గతంలో బీహెచ్‌ఈఎల్ కాలనీలో కొంతమంది వీధి కుక్కలను వదిలేసే ప్రయత్నం చేయగా, స్థానికులు నిలదీశారు. దీంతో వారు వెనక్కి వెళ్లారు.
పలు కాలనీల్లో కుక్కలు ఇళ్లలోకి చొరబడిపోతున్నాయి. కనిపించిన వస్తువులను లాక్కెళ్లిపోతున్నాయి. డోర్ తీయాలంటేనే పలువురు హడలిపోతున్నారు.
బైక్‌పై రోడ్డు మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. బైక్‌ల వెంట కుక్కలు పడుతున్న కారణంగా పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు.
వీధి కుక్కల నియంత్రణలో భాగంగా వాటిని పట్టుకొని కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. అయినా రోజురోజుకు కుక్కల సంఖ్య పెరుగతుందేకానీ తగ్గడం లేదు.
చిన్నారులను తల్లిదండ్రులు బయటకు పంపలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ వారు బయటకు వెళ్లినా తిరిగొచ్చే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు.
జనవరి– 22 48
ఫిబ్రవరి 42
మార్చి 29
ఏప్రిల్ 37
మే 39
జూన్ 26
జూలై 41
ఆగస్టు 27
సెప్టెంబర్ 30
అక్టోబర్ 23
నవంబర్ 27
డిసెంబర్ 22
జనవరి– 23 32
ఫిబ్రవరి–23 30
(రామచంద్రాపురం ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో కుక్కకాటు చికిత్స తీసుకున్నవారు)
