
దెబ్బతిన్న వరి పంటను పరిశీలిస్తున్నవ్యవసాయ అధికారులు
● ఏడాది పొడవునా వెంటాడిన అతివృష్టి ● వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసం ● పరిహారం ఇవ్వకుండా చేతులెత్తేసిన గత ప్రభుత్వం ● రుణమాఫీ, రైతుబంధు రాక అవస్థలు ● కష్టాల కడలిలో జిల్లా రైతులు
జిల్లాలో ఈ సంవత్సరం రబీ సీజన్‌లో 3.45 లక్షల ఎకరాల్లో వరితోపాటు వివిధ రకాల పంటలను సాగు చేశారు. తీరా పంట చేతికందే ఏప్రిల్ నెలలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా 12, 265 ఎకరాల్లో వరితోపాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. అప్పట్లో సీఎం కేసీఆర్ రైతులను ఆదుకుంటానని, ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తానని రైతులకు హామీ ఇచ్చారు. జిల్లాలో రూ.12 కోట్ల 25 లక్షల 86 వేల పంట నష్టం వాటిల్లిందని గుర్తించారు. ఈ మొత్తాన్ని బాధిత రైతులకు పరిహారం రూపంలో ఇవ్వాల్సి ఉంది. కానీ కేవలం రూ. 8.86 లక్షలు మాత్రమే ఇచ్చారు.
కాని రుణమాఫీ..
జిల్లాలో రూ.లక్షలోపు రుణాలకు 1,50,514 మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా గుర్తించారు. వీరికి రూ.912 కోట్లు మాఫీ కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 73,026 మంది రైతులకు రూ.366 కోట్లు మాత్రమే మాఫీ అయ్యింది. ఇంకా 77,488 మంది రైతులకు గాను రూ.546 కోట్లు మాఫీ కావాల్సి ఉంది.ఈ రుణమాఫీ కోసం నిత్యం బ్యాంకుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పారు. దీనికి గాను రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
అందని రైతుబంధు..
ప్రభుత్వం మారినప్పటికీ ఈ యాసంగి పంట సాగు కోసం రైతు బంధు ఇంకా అందలేదు. జిల్లా వ్యాప్తంగా 3,06,437 ఎకరాల్లో వరితోపాటు ఇతర పంటలను 2,80,949 మంది రైతులు సాగు చేశారు. వీరికి పాత పద్ధతిన ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.200 కోట్ల 71 లక్షల 74 వేలు రైతుల ఖాతాల్లో జమకావాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం ఎకరం లోపు ఉన్న 1,11,241 మంది రైతులకు కేవలం రూ. 21 కోట్ల 9 లక్షల 81 వేలు జమ అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా 90 శాతం నిధులు రావాల్సి ఉంది. ఇప్పటికే సగం మేర వరినాట్లు పూర్తి అయ్యాయి. అన్నదాతలు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తూ పెట్టుబడికి అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
తగ్గిన ఆయిల్ పామ్ సాగు
జిల్లాలో ఎప్పుడు ఒకే రకమైన వరి పంటనే సాగు చేస్తున్నారని, దీని వల్ల భూసారం దెబ్బతింటుందని, వరికి బదులు అధిక లాభాలు గడించే ఆయిల్ పామ్ సాగుకు ప్రాధాన్యత ఇచ్చారు. గత ప్రభుత్వం ఈ ఏడాది జిల్లాకు 50 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు మంజూరు ఇచ్చింది. ఇందుకోసం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు, ఆయిల్ పామ్ మొక్కలకు ఎకరాకు రూ. 50 వేలు సబ్సిడీ ప్రకటించారు. 5 వేల ఎకరాలకు తగ్గకుండా ఆయిల్ పామ్ సాగు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. కానీ కేవలం వెయ్యి ఎకరాలు మాత్రమే సాగు చేసేందుకు రైతులు ముందుకొచ్చినట్లు సంబంధిత ఉద్యానవనశాఖ అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment