
సంగారెడ్డిలో మహిళ నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి / వట్‌పల్లి /రాయికోడ్(అందోల్) : సమస్యలు పరిష్కరించేందుకు ప్రజల వద్దకే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని గురువారం జిల్లాలో అట్టహాసంగా ప్రారంభించారు. పట్టణంలోని 3వ వార్డులో, చౌటుకూరు మండలం శివ్వంపేట, ఆందోల్ మండలం అల్మాయిపేట, సంగుపేట, రాయికోడ్ మండలం సింగితం గ్రామంలో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అమల్లోకి తెచ్చే బాధ్యత యంత్రాంగానిదేనని మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ పాలనను తిరిగి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అందోల్ నియోజకవర్గంలో కంపెనీలను ఏర్పాటు చేసి ఇక్కడి యువతకు, ప్రజలకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సింగితం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ ఉంటుందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొదటి రోజు దరఖాస్తు చేసుకోలేని వారు గ్రామపంచాయతీలో సెక్రటరీకి, అధికారులకు అందజేయవచ్చని తెలిపారు. అనంతరం మంత్రి దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లు ప్రారంభించారు. కౌంటర్ల వద్ద నేరుగా మహిళల నుంచి మంత్రి దరఖాస్తులు స్వీకరించారు.
ప్రత్యేక ఏర్పాట్లు
దరఖాస్తుల స్వీకరణకు మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. దరఖాస్తుదారులకు అధికారులు రశీదులు అందించారు.
దరఖాస్తులు పూరించడానికి అంగన్వాడీలు, విద్యావంతులు, ఇతర సిబ్బంది సహకరించారు. సభ ప్రారంభమైన వెంటనే అధికారులు సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. అన్ని సభలలో ప్రత్యేకించి మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ గ్రామాలలో, మున్సిపల్ వార్డులలో నిర్వహించిన ప్రజాపాలన సభలను సందర్శించి పర్యవేక్షించారు. అల్మాయిపేట ప్రజా పాలన కార్యక్రమం సభలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రజాపాలన కార్యక్రమంపై అవగాహన కల్పించారు.
ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ డాక్టర్ శరత్, ఎస్పీ రూపేష్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, ఆర్డీఓ రవీంద్రారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మీ, కమిషనర్ సుజాత, శివంపేట గ్రామ సభలో జెడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఎంపీపీ చైతన్యరెడ్డి, దుర్గారెడ్డి, నత్తి దశరథ్, ఆర్డీఓ పాండు, డీఎంహెచ్‌ఓ గాయిత్రిదేవి, డీపీఆర్‌ఓ విజయలక్ష్మి, జడ్పీటీసీ సభ్యులు మల్లికార్జున్‌పాటిల్, మాజీ జెడ్పీటీసీ నాగారం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీల అమలుకే దరఖాస్తుల స్వీకరణ
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
Comments
Please login to add a commentAdd a comment