శ్రీరాముడి పల్లకిపై విసిరిన బూటు
హత్నూర (సంగారెడ్డి): అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణం సందర్భంగా శ్రీరాముని పల్లకీ ఊరేగింపు నిర్వహిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బూటు విసిరిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలో శ్రీరాముని పల్లకీ సేవ నిర్వహిస్తుండగా ఓ ఇంటిపై నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బూటు విసిరారు. దీంతో రామభక్తులు కోపోద్రిక్తులయ్యారు. బూటు పడిన ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రామభక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలోని పండ్ల దుకాణాన్ని దగ్ధం చేశారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ దౌల్తాబాద్ పట్టణమంతా అర్ధరాత్రి వరకు ర్యాలీలు చేపట్టారు. సమాచారం అందుకున్న ఎస్పీ రూపేష్ కుమార్, పటాన్‌చెరు డీఎస్పీ, జిన్నారం, సంగారెడ్డి పటాన్‌చెరు సీఐలు, ఎస్సైలు పోలీసు బలగాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. రామ భక్తులను సముదాయించే ప్రయత్నం చేశారు.
వారి మాట వినకుండా ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి.. చెప్పు విసిరిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా బూటు విసిరిన ఇంటిపైన రాళ్లతో దాడికి దిగారు. నిందితుడిని గుర్తించి అరెస్టు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అయినా నిరసనకారులు వెనక్కు తగ్గకుండా అర్ధరాత్రి వరకు ఆందోళనను కొనసాగించారు. 108 అంబులెన్స్ రప్పించి భారీ పోలీస్ బందోబస్తు మధ్యలో బూటు విసిరిన కుటుంబ సభ్యులను భారీ బందోబస్తు మధ్య తరలించేందుకు ప్రయత్నం చేశారు. తహసీల్దార్ సంధ్య, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు.
ఎంతటి వారైనా శిక్షిస్తాం : ఎస్పీ
పల్లకీ సేవపై బూటు విసిరిన వారు ఎంతటి వారైనా శిక్షిస్తామని ఎస్పీ రూపేష్ తెలిపారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తామని రామ భక్తులకు హామీ ఇచ్చారు. దౌల్తాబాద్‌లో పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment