
ఆటోను ఢీకొట్టిన కారు
– నలుగురికి గాయాలు
నారాయణఖేడ్: ఆటోను కారు ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులతోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటప జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. క్షతగాత్రుల కథనం మేరకు.. నిజాంపేట వైపు నుంచి ఖేడ్ వైపు వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో ఆటలో ప్రయాణిస్తున్న జూకల్ శివారులోని సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో చదువుతున్న మనూరు మండలం రాణాపూర్‌కు చెందిన వంశీ, చాప్టా(కె)కు చెందిన సచిన్‌తోపాటు ఖేడ్ పట్టణానికి చెందిన జ్యోతి, ర్యాలమడుగుకు చెందిన ఆటో డ్రైవర్ నారాయణకు గాయాలు అయ్యాయి. అటుగా వస్తున్న మున్సిపల్ మాజీ చైర్మన్ నజీబ్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు నగేశ్ క్షతగాత్రులను ఆటోల్లో ఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. గురుకులం ప్రిన్సిపాల్ లింగారెడ్డి ఆస్పత్రిని సందర్శించి విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): ఎదురుగా వస్తున్న కారును ఆటో ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు.ఈ ఘటన మండలంలోని కంభాలపల్లి శివారులో శనివారం చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ మహేశ్ గౌడ్ కథనం మేరకు.. మునిపల్లి మండలంలోని మేల సంఘం గ్రామానికి చెందిన ఏర్పుల నాగరాజ్(28) ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఇతను వికారాబాద్ జిల్లా మోమిన్ పేట గ్రామంలో మేకల అంగడీకి వెళ్లాడు. మేకలను కొనుగోలు చేసి గ్రామానికి ఆటోలో తమ్ముడు మల్లేశ్‌తో కలిసి వస్తుండగా కంబాలపల్లి శివారులో ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగరాజుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తమ్ముడికి తీవ్ర గాయాలు కావడంతో సంగారెడ్డి ప్రభుత్వాత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
బొలెరో వాహనం బోల్తా
– గొర్రెల వ్యాపారి మృతి – నలుగురికి స్వల్ప గాయాలు
దుబ్బాకరూరల్: బొలెరో వాహనం బోల్తా పడి గొర్రెల వ్యాపారి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని హబ్సిపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ కథనం మేరకు.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామానికి చెందిన వజ్జ ఐలయ్య(74) గొర్రెల వ్యాపారం చేస్తాడు. శనివారం తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా నవీపేటలో జరిగే గొర్రెల, మేకల సంతకు భయ్య లక్ష్మణ్‌కు చెందిన బొలెరో వాహనంలో లింగన్న, ఈరన్న, రమేశ్‌తో కలిసి బయల్దేరాడు. హబ్సిపూర్ గ్రామ శివారులోకి రాగానే వాహనం బోల్తా పడింది. ఐలయ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీస్‌లు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
కారును ఢీకొట్టిన లారీ
చిన్నశంకరంపేట(మెదక్): కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టిన ఘటన నార్సింగి మండలం సంకాపూర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. నార్సింగి ఎస్‌ఐ అహ్మద్ మొహినొద్దీన్ కథనం మేరకు.. శుక్రవారం రాత్రి మేడ్చల్ జిల్లా అల్వాల్‌కు చెందిన డబిల్‌పురం నిహల్ బంధువులతో కలిసి కారులో కాశీ నుంచి జాతీయ రహదారిపై వస్తున్నాడు. ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతోపాటు కారును కొద్ది దూరం లాక్కుపోయింది. ఈ ఘటనలో కారు దిబ్బతినగా ఆరుగురు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. దీంతో లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆటోను ఢీకొట్టిన కారు
Comments
Please login to add a commentAdd a comment