
మాపై కేసులు పెట్టడం సరికాదు
● వీరన్నపేట గ్రామస్తులు ● పాఠశాల స్థలం విషయంలో కోర్టుకు హాజరు
చేర్యాల(సిద్దిపేట): పాఠశాల స్థలం విషయమై మండల పరిధిలోని వీరన్నపేటకి చెందిన పలువురు చేర్యాల కోర్టుకు హాజరయ్యారు. శనివారం కోర్టు ఆవరణలో వారు మాట్లాడుతూ.. 20 ఏళ్ల కిందట పాఠశాల భవనం నిర్మాణం కోసం గ్రామానికి చెందిన తరిగొప్పుల ఐలుమల్లు, బాలమ్మ దంపతుల నుంచి కుల సంఘాల ఆధ్వర్యంలో చందాలు వసూలు చేసి 2 ఎకరాల 5 గుంటల భూమి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆ స్థలంలోనే పాఠశాల భవన నిర్మాణం, క్రీడా ప్రాంగణం, మూత్రశాలల నిర్మాణంతోపాటు పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డుల్లో 1 ఎకరం 26 గుంటల భూమి పాఠశాల పేరిట ఉండగా మిగిలిన 19 గుంటల భూమి అమ్మిన వారి పేరు మీదనే వస్తుందన్నారు. తమ పేరిట ఉన్న భూమి కోసం భార్యాభర్తలు ఇద్దరూ మా ఐదుగురిపై కోర్టులో కేసు వేశారని పేర్కొన్నారు. పాఠశాల భూమితో మాకు ఎలాంటి సంబంధం లేదని, అది కేవలం పాఠశాల భవన నిర్మాణం కోసం కొనుగోలు చేసిందన్నారు. కోర్టుకు హాజరైన వారిలో మాజీ సర్పంచ్ కొండపాక భిక్షపతి, మాజీ ఎంపీటీసీ ఆరెళ్ల పాపయ్య, కొండాపురం మధు, పైస లింగం, సూర్న బీరుమల్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment