
భయం వీడు.. విజయం తోడు
ఆత్మస్థైర్యమే తొలి గెలుపు
తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో ప్రథమ స్థానంలో నిలవాలంటూ పిల్లలపై ఒత్తిడి, లక్ష్యాన్ని నిర్దేంశిచకూడదు. ప్రశాంత వాతావరణంలో చదివే ఏర్పాటు చేయాలి. పరీక్షల సమయంలో ప్రతీ విద్యార్థి కనీసం ఆరుగంటల నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోయేలా చూడాలి. పరీక్షల సమయంలో పిల్లలను జంక్ పుడ్‌కు దూరంగా ఉంచాలి,శాఖాహర భోజనం ఉండేలా చూడాలి. ఆత్మస్థైర్యమే విద్యార్థుల తొలి గెలుపు.
– డాక్టర్ విజయ్, మానసిక వైద్యులు
సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రి
సంగారెడ్డి క్రైమ్: విద్యార్థి జీవితంలో 10వ తరగతి, ఇంటర్ కీలక మలుపు. ప్రస్తుతం వార్షిక పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో కొంతమంది విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారు. పరీక్ష అంటే భయం, వచ్చిన మార్కులపై నిరాశ, చదివిన అంశాలు గుర్తుకు ఉండటం లేదని భావన , ఇతర విద్యార్థులతో పోలిస్తే తము వెనుకబడి పోతున్నాం ఆలోచనలతో ఉంటున్నారు. ఈ క్రమంలో క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. భయాన్ని పక్కన పెట్టి మీకు ఎంత తెలుసో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి.. ఫెయిలైతే జీవితం అక్కడితో ఆగిపోదని.. ధైర్యంగా ప్రణాళికతో ముందుకు సాగితే విజయం మీ సొంతం అవుతుందని మానసిక వైద్య నిపుణులు విద్యార్థులకు సూచిస్తున్నారు.
తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి
చదువు విషయంలో తరగతిలో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి.వార్షిక పరీక్షల సమయంలో తమ పిల్లలను చెడు ఆలోచనలకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ప్రతీ విద్యార్థికి ఒకటి, రెండు సబ్జెక్ట్‌లపై ఇష్ట ముంటుంది వాటిని వేగంగా చదివేస్తే మిగిలిన వాటికి సమయం దొరుకుతుందని పిల్లలకు అర్థమయ్యే విధంగా టీచర్‌లు, తల్లిదండ్రులు వివరించాలి. సమాజంలోని మహనీయులను మార్గదర్శకత్వంగా తోసుకోవాలని తమ పిల్లల్లో స్ఫూర్తి నిప్పాలి.
సోషల్ మీడియాకు దూరంగా
పరీక్షలు పూర్తయేవరకు పిల్లలను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి. ఫోన్ లేదా కంప్యూటర్ అతి వినియోగాన్ని కట్టడి చేయాలి. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లల ముందు టీవీ గాని, ఫోన్ గాని ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు. తమ పిల్లలకు ఇంట్లో చదువుకునే విధంగా ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాలి.
టెలీ మానస్ సేవలు
ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు టెలీ మానస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం టెలీమానస్ పేరుతో టోల్ ఫ్రీ నంబర్లు 14416, 18008914416 అందుబాటులోకి తీసుకొచ్చారు. వార్షిక పరీక్షల సమయంలో ఈ నంబర్లకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఫోన్ చేస్తే మానసిక స్థైర్యాన్ని పెంపొందించి సూత్రాలు, పరీక్షల సమయంలో భయబ్రాంతులకు గురికాకుండా చిట్కాలను నిపుణులు ఫోన్‌లో గాని, తమ సెక్షన్‌లో వివరిస్తారు.
ఇంటర్, పదో విద్యార్థులకు కౌన్సెలింగ్
టెలీమానస్‌తో ఆత్మవిశ్వాసం
నింపుతున్న నిపుణులు

భయం వీడు.. విజయం తోడు
Comments
Please login to add a commentAdd a comment