
24నుంచి హరీశ్ పాదయాత్ర!
జహీరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సాగునీటిని అందించి బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు వీలుగా మంజూరు చేసిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను సాధించేందుకు మాజీమంత్రి హరీశ్‌రావు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం పార్టీ నేతలు రూట్ మ్యాప్, తేదీలను ఖరారు చేశారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు ధ్రువీకరించారు. ఆయా పథకాల పనులు ప్రారంభించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, పాదయాత్ర ద్వారా వాటిని సాధించుకోవడమే లక్ష్యంగా హరీశ్‌రావు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి సాగునీటిని అందించేందుకు వీలుగా బసవేశ్వర పథకానికి అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేశారు. ఈ పథకాన్ని సాధించేందుకు గాను ఈనెల 24న బోరంచ లోని పోచమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి నారాయణఖేడ్ వరకు సుమారు 15 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారు.
మూడు నియోజకవర్గాలకు సాగునీటికోసం...
జహీరాబాద్, సంగారెడ్డి, అందోల్ నియోజకవర్గాలకు సాగు నీటిని అందించేందుకు వీలుగా సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ పథకాన్ని సాధించేందుకు వీలుగా మండల కేంద్రమైన ఝరాసంగంలోని శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయంలో హరీశ్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి 15 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా జహీరాబాద్ చేరుకుంటారు. పాదయాత్ర అనంతరం ఆయా నియోజకవర్గం కేంద్రాల్లో బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2021లో ఆయా ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి. 21 ఫిబ్రవరి 2022లో నారాయణఖేడ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. ఆయా పథకాలకు గాను రూ.4,500 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సింగూరుకు నీటిని మళ్లించి 20 టీఎంసీల వినియోగంతో 3.84లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు రెండు ఎత్తిపోతల పథకాలను గత ప్రభుత్వం చేపట్టింది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి గాను 6,293 ఎకరాల భూమి అవసరం అవుతుందని, రూ.2,653 కోట్ల మేర నిధులు అవసరం అవుతాయని అంచనా వేశారు.
115 గ్రామాల్లో 1,03,259 ఎకరాలకు...
జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 11 మండలాలకు చెందిన 231 గ్రామాల్లోని 2.19లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలోని 115 గ్రామాల్లో 1,03,259 ఎకరాలకు సాగు నీటిని అందించాలని ప్రతిపాదించారు. అందోల్ నియోజకవర్గంలోని రెండు మండలాల పరిధిలో 66 గ్రామాలకు చెందిన 65,816 ఎకరాలకు, సంగారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో 50 గ్రామాల్లోని 49,925 ఎకరాలకు సాగు నీరందించాలని నిర్ణయించారు. ఇందు కోసం 12 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి సాగు నీటిని అందించేందుకు గాను బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ పథకం కింద 8 టీఎంసీల నీటితో 1,65లక్షల ఎకరాలకు నీటిని అందించాలని ప్రతిపాదించారు. ఇందు కోసం రూ.1,774కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు.14 జూన్ 2021లో సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సంబంధించి అందోల్ నియోజకవర్గంలోని కంకోల్‌లో సంప్‌హౌజ్, 21 జూన్ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సంబంధించిన సంప్‌హౌస్ నిర్మాణానికి, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయా పథకాలకు గ్రహణం పట్టింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా ప్రాజెక్టుల విషయంలో ఇటీవల ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో జహీరాబాద్ ప్రాంత నేతల సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. అవసరం అయితే ఉద్యమాన్ని చేపట్టి ఆయా ప్రాజెక్టులను సాధిస్తానని ప్రభుత్వానికి హెచ్చరిక సైతం జారీ చేశారు.
బసవేశ్వర కోసం బోరంచ నుంచి ఖేడ్ వరకు..
సంగమేశ్వర కోసం మార్చి 1న కేతకీ ఆలయం నుంచి జహీరాబాద్ వరకు
పథకాలను సాధనే లక్ష్యంగా..
ఇప్పటికే పార్టీ నేతలతో సమావేశం
స్థానిక నేతలతో హరీశ్‌రావు భేటీ
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. ఈనెల 14న హైదరాబాద్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కె.మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్‌లతో సమావేశమయ్యారు. ఈ ప్రాజెక్టులపై ప్రభు త్వం కావాలని తాత్సారం చేస్తోందని ఆరోపించారు. పాదయాత్ర చేపట్టేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment