
రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనుల్లో వేగం
● నెల రోజుల్లో పూర్తి ● రూ.90కోట్లతో నిర్మాణం ● ముమ్మరంగా సాగుతున్న బీటీ పనులు
జహీరాబాద్: పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఎట్టకేలకు వేగం పుంజుకుంది. బ్రిడ్జిపై బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. నెల రోజుల్లో పనులన్నీ పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధం కానుందని రోడ్డు భవనాల (ఆర్‌అండ్‌బీ) శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు అంచనా రూ.90కోట్లు కాగా, అందులో రూ.50 కోట్లు భూ సేకరణ కోసం కేటాయించారు. రూ.40 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటివరకు రూ.23కోట్ల మేర నిధులు విడుదలైనట్లు అధికారులు వివరించారు. బ్రిడ్జి పైభాగంలో ప్లాస్టరింగ్‌తోపాటు వైరింగ్, విద్యుత్ స్తంభాల బిగింపు వంటి ఎలక్ట్రిక్ ఫిక్సేషన్ పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం అంచనాలతో ప్రతిపాదనలు పంపాల్సి ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. బ్రిడ్జి నిర్మాణం కోసం 17వేల క్యూబిక్ మీటర్ల మట్టిని ఉపయోగించారు. మట్టికి సంబంధించి మైనింగ్ శాఖకు రాయల్టీ చెల్లించాల్సి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బ్రిడ్జి వద్ద నుంచి బీదర్ క్రాస్ రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాగా, డివైడర్ పనులు కొనసాగుతున్నాయి. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకుండా పనులు పర్యవేక్షిస్తున్నట్లు ఏఈఈ సంధ్య తెలిపారు. నెల రోజుల్లో పనులన్నీ పూర్తి అవుతాయని, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయన్నుట్లు తెలిపారు.
ఆరేళ్లకు మోక్షం
రైల్వే ఓవర్‌బ్రిడ్జి చేపట్టిన ఆరేళ్లకు నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. స్థానిక లెవెల్ క్రాసింగ్ మీదుగా హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి నాందేడ్, పూర్ణ, షిర్డీ, పర్లీ, లాతూర్ ప్రాంతాలతోపాటు బెంగళూరు, తిరుపతి, కాకినాడ ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. అంతేకాకుండా గూడ్స్ రైళ్లు సైతం ఎక్కువగా వచ్చి పోతుంటాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ మార్గంలో రైలు వచ్చిన ప్రతీసారి గేట్లు మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. పట్టణ ప్రజలతోపాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలు వచ్చిన ప్రతీసారి రైల్వే గేటు వద్ద కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు ఆగాల్సి వస్తోంది. కష్టాలను దూరం చేసేందుకు వీలుగా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018లో రూ.90కోట్లు మంజూరు చేయగా అదే ఏడాది ఆగస్టు 30న ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టారు.
శాశ్వతంగా తీరనున్న కష్టాలు
రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయ్యి వినియోగంలోకి వస్తే వాహన చోదకుల కష్టాలు శాశ్వతంగా తొలగనున్నాయి. జహీరాబాద్–పర్లీ తదితర ప్రాంతాలకు అనునిత్యం 36 రైళ్ల వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో తరచూ రైల్వేగేటు మూసి ఉంచడంతో ట్రాఫిక్ స్తంభించి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేని పరిస్థితి ఉంది. బ్రిడ్జి పనులు పూర్తిచేసి వినియోగంలోకి వస్తే ప్రజలు, ప్రయాణికుల కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment