
సీసీఐలో వెయ్యి క్వింటాళ్ల దళారుల పత్తి
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్‌లోని నాలుగు కాటన్ మిల్లులో నాలుగు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయగా అధికారులు వెయ్యి క్వింటాళ్లు దళారుల పత్తిని గుర్తించారు. ఇక్కడ బోగస్ రైతుల పేరున దళారులు నాసిరకం పత్తి విక్రయిస్తున్నారని సాక్షిలో పక్షం రోజుల కింద ‘సీసీఐలో సిత్రాలు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు మరుసటి రోజే కాటన్ మిల్లులను తనిఖీ చేయడంతో దళారుల దందా మూడు రోజులు ఆగి మరుసటి రోజు నుంచి కొనసాగింది. సోమవారం జిల్లా వ్యవసాయ అధికారి రాధ, మార్కెటింగ్ అధికారి నాగరాజు, ఏడీఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారు ఇప్పటికే గుర్తించిన మీర్జాపూర్ గ్రామంలోని 12 మంది బోగస్ రైతులను కలిశారు. మాందాపూర్‌లో నలుగురు, హుస్నాబాద్ కస్టర్ పరిధిలో ఇద్దరు మొత్తం 18 మంది బోగస్ రైతులు ఉన్నట్లు తేల్చారు. 18 మంది పేరున వ్యాపారులు 1,000 క్వింటాళ్లు విక్రయించి దళారులు రూ.15 లక్షల లాభాలను పొందారు. ఈ దందాకు సహకరించిన అధికారులకు, కంప్యూటర్ ఆపరేటర్లకు, రాజకీయ నాయకులకు దళారులు రూ.5 లక్షల వరకు కమీషన్ల కింద పంపిణీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
పంట వేయని రైతుల పేరున ధ్రువీకరణలు
హుస్నాబాద్ కాటన్ మిల్లు వ్యాపారులు మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, జనగామ జిల్లాల నుంచి నాసిరకం పత్తిని క్వింటాల్‌కు రూ.6 వేల చొప్పున కొనుగోలు హుస్నాబాద్ సీసీఐ కేంద్రాలకు తరలించారు. బోగస్ రైతుల పేరున ధ్రువీకరణ పత్రాలు తయారు చేసే వరకు పత్తి వాహనాలను మిల్లులో పక్కన పార్కింగ్ చేసి పెట్టారు. హుస్నాబాద్, మహ్మదాపూర్, మీర్జాపూర్ వ్యవసాయ క్లస్టర్ పరిధిలోని ఏఈఓలకు తెలువకుండానే 18 మంది రైతులకు బోగస్ ధ్రువీకరణ పత్రాలను సృష్టించారు. మా సంతకాలను ఫోర్జరీ చేసినట్లు ఏఈఓ లు ఏడీఏకు ఫిర్యాదు చేశారు. దీనిపై మార్కెట్ కార్యాలయంలో విచారణ జరిపిన అధికారులకు ఏఈఓల సంతకాలు ఫోర్జరీ చేసి బోగస్ రైతుల పేరున ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్లు గుర్తించారు. మండల వ్యవసాయ అధికారి నాగరాజు దగ్గర ఉండాల్సిన రసీదు బుక్ నుంచే ధ్రువీకరణ పత్రాలు వెళ్లినట్లు డీఏఓ రాధిక వెల్లడించారు. మార్కెటింగ్ అధికారులతో కలిసి విచారణ చేసి కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
రూ.15 లక్షలు వ్యాపారులకు లాభం
కమీషన్ల పేరుతో రూ.5 లక్షలు పంపకం
18 మంది బోగస్ రైతులను గుర్తించిన
అధికారులు
Comments
Please login to add a commentAdd a comment