ఇష్టంతో కష్టపడి చదవండి
ప్రజావాణిలో రెవెన్యూ సమస్యలే అధికం
రామచంద్రాపురం(పటాన్‌చెరు): విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సోమవారం సాయంత్రం బీహెచ్‌ఈఎల్ (భెల్) టౌన్‌షిప్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలను ఆమె సందర్శించారు. పాఠశాల ఆవరణలో ఉన్న రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్, అందులోని కంప్యూటర్, సైన్స్ ల్యాబ్, వంటగదిని పరిశీలించారు. పాఠశాలలోని సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్య, విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవని, అదే విధంగా తరగతి గదులల్లో విద్యార్థులు కూర్చునేందుకు టేబుల్, బల్లలు సరిపడా లేవని ఉపాధ్యాయులు కలెక్టర్‌కు వివరించారు. స్పందించిన ఆమె.. భెల్ యాజమాన్యంకు సీఎస్‌ఆర్ నిధుల కింద సమస్యలను పరిష్కారించాలని కోరుతూ లేఖ రాయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లును ఆదేశించారు.
అనంతరం పరీక్షలకు సిద్ధమవుతున్న పదవతరగతి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల సమయం దగ్గర పడుతుందని దానిని దృష్టిలో పెట్టుకొని కష్టపడి చదివి ప్రతి విద్యార్థి 10కి10 జీపీఏ సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో ఏ ఉద్యోగం చేయాలో ఇప్పుడే నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా కష్టపడి చదువుకోవాలని సూచించారు. జీవితంలో పదోతరగతి టర్నింగ్ పాయింట్ అని చెప్పారు. తరగతి గదిలో చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె కోరారు. పదవతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎంఈఓ పీపీ రాథోడ్, తహసీల్దార్ సంగ్రాంరెడ్డి, ప్రధానోపాధ్యాయులు రాములు, ఆర్‌ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు.
సంగారెడ్డి జోన్: ప్రజావాణిలో రెవెన్యూకు సంబంధించిన దరఖాస్తులే అధికంగా వస్తున్నాయి. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వారితో కలెక్టర్ వల్లూరు క్రాంతి అర్జీలు స్వీకరించారు. మొత్తం 43 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించిన సమస్యలే అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అర్జీని పరిశీలించి, తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన సమస్యలపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, పరిష్కారం ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కాగా కార్యక్రమంలో డీఆర్‌ఓ పద్మజా రాణి, జెడ్పీ సీఈవో జానకిరెడ్డి, డీపీవో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడే ఉన్నత లక్ష్యాలను ఎంచుకోండి
విద్యార్థులకు కలెక్టర్ క్రాంతి ఉద్బోధ
భెల్ జిల్లా పరిషత్ పాఠశాల సందర్శన
మేడం.. మాకు సార్లు కావాలి
‘‘మేడం.. హిందీ, పీఈటీ సార్లు లేరు. మాకు ఉపాధ్యాయులు కావాలి..’’అని రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్ (ఆర్‌బీఎస్) విద్యార్ధులు కలెక్టర్ క్రాంతిని వేడుకున్నారు. సోమవారం సాయంత్రం భెల్ టౌన్‌షిప్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి తిరిగి వెళ్లే సమయంలో క్రీడా ప్రాంగణంలో ఆడుకుంటున్న రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థులను పిలిచి మాట్లాడారు. ఎలా చదువుకుంటున్నారు.. మీకేమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. తమకు హిందీ, పీఈటీ సార్లు లేరని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జెడ్పీ పాఠశాలలో ఉన్న పీఈటీ ఉపాధ్యాయుడు ఈ విద్యార్థులను కూడా ఆడిస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. ఈ సమస్యను పరిష్కారించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లను కలెక్టర్ ఆదేశించారు. దాంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయండి: కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment