బాబుల్‌గాం గ్రామం ముందుగా నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉండేది. ఈ గ్రామం ప్రజలు అప్పటి మండల కేంద్రం జుక్కల్‌కు వెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కౌలాస్‌నాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో పుట్టిల ద్వారా వెళ్లాల్సి వచ్చేది. రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలంటే సుమారు 40 కి.మీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో ఈ గ్రామానికి అధికారులు రావాలన్నా.. గ్రామస్తులు వివిధ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలన్నా అనేక ఇబ్బందులు తప్పేవి కావు. పుట్టిల్లో ప్రయాణించే సమయంలో పలుమార్లు ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఈ గ్రామంలో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రం నిర్వహణ సరిగా ఉండేది కాదు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే సమయంలో ఈ గ్రామాన్ని సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోకి మార్చింది. కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్‌ను కూడా కొత్త మండలం చేసింది. ఈ పెద్దకొడప్‌గల్ తమకు దగ్గర అవుతుందని బాబుల్‌గాం గ్రామస్తులు డిమాండ్ చేయడంతో ఈ గ్రామాన్ని సంగారెడ్డి జిల్లా నుంచి తొలగించి, పెద్ద కొడప్‌గల్ మండలం (కామారెడ్డి)లో చేర్చారు. రెవెన్యూ పరంగా రికార్డులను కూడా ఆ జిల్లా అధికార యంత్రాంగానికి అప్పగించారు. కానీ పంచాయతీరాజ్ గెజిట్ ప్రకారం ఇంకా సంగారెడ్డి జిల్లా పరిధిలోనే కొనసాగుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment