
బాబుల్‌గాం.. అటా ఇటా!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి– కామారెడ్డి జిల్లాల సరిహద్దు గ్రామం బాబుల్‌గాం సమస్య ఇంకా పూర్తి స్థాయిలో తీరలేదు. కర్నాటక సరిహద్దుల్లోని కంగ్టి మండలం పరిధిలో ఉన్న ఈ మారుమూల గ్రామంలో ఇప్పటికీ రెండు జిల్లాల అధికార యంత్రాంగం పాలన కొనసాగుతుండటం గమనార్హం. ఈ గ్రామంలోని భూములు, ఇతర రెవెన్యూశాఖ పరంగా పాలనంతా కామారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం పరిధిలోకి మారింది. కానీ పంచాయతీరాజ్ పాలన విషయానికి వస్తే మాత్రం ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఆ జిల్లాకు మారలేదు. పంచాయతీ గెజిట్‌లో కూడా ఇంకా సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంది. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభను కూడా ఈ బాబుల్‌గాంలో సంగారెడ్డి అధికార యంత్రాంగమే నిర్వహించింది. కాగా, రాష్ట్ర ప్రణాళిక శాఖ సోమవారం తెలంగాణ అట్లాస్ (తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్) –2024ను విడుదల చేసింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గం పరిధిని కామారెడ్డితో పాటు, సంగారెడ్డి జిల్లాలో కూడా ఉందని ఈ అట్లాస్‌లో పేర్కొంది.
ఈ గ్రామంలో ఎన్నికలు ఎవరు జరపాలి
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఓటరు జాబితా, రిజర్వేషన్ల ఖరారు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఏ జిల్లా అధికారులు జరపాలనే దానిపై ఇటీవల తర్జన భర్జన జరిగింది. పంచాయతీరాజ్ గెజిట్ ప్రకారం ఈ గ్రామం సంగారెడ్డి జిల్లాలో ఉండగా, ఈ ఎన్నికల ఏర్పాట్లు మాత్రం కామారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం చేసింది. టీ–పోల్ వెబ్‌సైట్‌లో కూడా సంగారెడ్డి జిల్లా పరిధిలోంచి తొలగించి కామారెడ్డి జిల్లా పరిధిలోనే మార్చారు.
అసెంబ్లీ ఆమోదంతోనే..
ఈ గ్రామం పూర్తి స్థాయిలో కామారెడ్డి జిల్లాలోకి వెళ్లాలంటే పంచాయతీరాజ్ గెజిట్‌లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అసెంబ్లీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఈ గ్రామం రెండు జిల్లాల పరిధిలో ఉన్నట్లు రికార్డులు చూపుతోంది. అలాగే జుక్క ల్ (కామారెడ్డి జిల్లా) అసెంబ్లీ నియోజకవర్గం పరిధి సంగారెడ్డి జిల్లాలో కూడా ఉన్నట్లు చూపుతోంది.
రెవెన్యూ పరంగా కామారెడ్డి జిల్లా..
పంచాయతీరాజ్ గెజిట్‌లో సంగారెడ్డిలోనే..
రెండు జిల్లాల మధ్య నలుగుతున్న గ్రామం
Comments
Please login to add a commentAdd a comment