
ఆదాయం ఘనం.. సౌకర్యాలు శూన్యం
కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లోనే అతి పెద్ద అంగడి
● రోడ్ల పైనే వ్యాపారం ● పరదాలు కప్పుకొని కాలం వెల్లదీస్తున్న వ్యాపారులు ● కనీస సౌకర్యాలు కల్పించని మున్సిపాలిటీ అధికారులు ● గత ఏడాది వారాంతపు సంత వేలం రూ.1.20 కోట్లు ● నేడు అంగడి బహిరంగ వేలం
హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపాలిటీకి వారాంతపు సంత ఆదాయం వెన్నుదన్నుగా నిలుస్తోంది. గుండు పిన్ను మొదలుకొని ఇంటికి కావాల్సిన వస్తువులు, నిత్యావసర వస్తువులు, వ్యవసాయ పనిముట్లు ఇతరత్రా వస్తువులు అంగడిలోనే లభిస్తాయి. కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లోనే అతి పెద్ద సంత. మున్సిపాలిటీకి ఇంటి పన్నులు, వాణిజ్య పరంగా వచ్చే ఆదాయం కంటే ఎక్కువగా అంగడి ద్వారానే సమకూరుతోంది. కానీ సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. ప్రతి శుక్రవారం వార సంత జరుగుతోంది. కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్ నుంచి వ్యాపారులు వస్తుంటారు. ప్రతి వారం జరిగే అంగడిలో కోట్లల్లో వ్యాపారం జరుగుతోంది.
రోడ్ల పైనే వ్యాపారం
పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా నుంచి మొదలుకొని ఎల్లమ్మ చెరువు కట్ట వరకు అంగడి కొనసాగుతోంది. వారాంతపు సంతలో అన్ని రకాల తాజా కూరగాయలు లభిస్తాయి. వివిధ మండలాల నుంచి రైతులు కూడా వచ్చి పండించిన పంటలను ఇక్కడ అమ్ముకుంటారు. పట్టణవాసులు వారానికి సరిపడా కూరగాయలు కొనుగోలు చేస్తారు. అలాగే కూరగాయలు, నిత్యావసర వస్తువులు, ఎండు మిర్చి, బట్టలు, వ్యవసాయ పనిముట్ల అమ్మకాలు జోరుగా సాగుతాయి. అంగడికి ప్రత్యేక స్థలం లేక అన్ని వ్యాపారాలు రోడ్లపైనే నిర్వహిస్తున్నారు. వ్యాపారులు ప్లాస్టిక్ పరదాలు వేసుకొని ఎండకు ఎండుతూ వానకు నానుతూ వ్యాపారం చేసుకుంటున్నారు. అంగడి నిర్వాహకులు వారి నుంచి రూ.50 నుంచి మొదలు కొని రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. మున్సిపాలిటీకి లక్షల్లో ఆదాయం వస్తున్నా.. సౌకర్యాలు కల్పించాలని వారు అధికారులను వేడుకున్నా పట్టించుకోవడం లేదు. తాగడానికి నీరు, ఉండటానికి నిలువ నీడ కూడా ఉండదు. ప్రతి శుక్రవారం ఈ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం జరుగుతోంది.
నేడు అంగడి బహిరంగ వేలం
మున్సిపల్ కార్యాలయంలో వారాంతపు సంత నిర్వహణ కోసం సోమవారం బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఒక్కో గుత్తేదారుడు రూ.10 లక్షల ధరావత్తు సొమ్ము తో పాటు రూ.5 వేల దరఖాస్తు ఫీజు చెల్లించి వేలంలో పాల్గొంటారు. వేలం దక్కించుకోవడానికి హుస్నాబాద్, సిద్దిపేట, పరకాల, జమ్మికుంట, నల్లగొండ, కరీంనగర్ నుంచి గుత్తేదారులు పోటీ పడ తారు. వేలంలో పాల్గొనడానికి 11 మంది దరఖాస్తు చేసుకున్నా రు. గత ఏడాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన రుద్రాక్ష శ్రీనివాస్ రూ.కోటీ 20 లక్షల 26వేలకు సంత ను దక్కించుకున్నాడు. ఈ ఏడాది అంతకంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని మున్సిపల్ అధికారులు అంచనా వేస్తున్నారు.
త్వరలో రైతు బజార్‌కు పంపిస్తాం
కొత్తగా రైతు బజార్‌ను నిర్మించాం. టాయిలెట్స్ పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తి కాగానే రోడ్ల పై కూరగాయలు అమ్ముకుంటున్న వ్యాపారులను అక్కడికి తరలిస్తాం. రోడ్ల పై అమ్మకుండా చర్యలు తీసుకుంటాం. అంగడికి వచ్చే రైతులు, వ్యాపారులు, ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తాం.
– మల్లికార్జున్,
మున్సిపల్ కమిషనర్, హుస్నాబాద్

ఆదాయం ఘనం.. సౌకర్యాలు శూన్యం