పురుగు మందు తాగి..
నర్సాపూర్ రూరల్: కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చిన్నచింతకుంట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్‌ఐ లింగం కథనం మేరకు.. గ్రామానికి చెందిన బండ పోచయ్య (50) కుటుంబ కలహాలతో మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రమాదవశాత్తు కిందపడ్డ వ్యక్తి..
మునిపల్లి(అందోల్): ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు చెందాడు. బుధవారం ఎస్‌ఐ రాజేశ్ నాయక్ కథనం మేరకు.. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన సతీష కుమార్ (28) ఈ నెల 18న బుదేరా పెట్రోల్ పంపులో షెడ్ వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి గాయాల పాలయ్యాడు. వెంటనే క్షతగాత్రుడిని సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.