సిద్దిపేటరూరల్: రాష్ట్రంలో ఆశా వర్కర్‌లకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించి, సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాలస్వామి డిమాండ్ చేశారు. బుధవారం ఆశాల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా గోపాల్ స్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి నేడు మర్చిపోయిందన్నారు. సమస్యలు పరిష్కారించాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఉన్నతాధికారులకు ఆశాలు అనేక వినతిపత్రాలు అందించారన్నారు. ఎన్నో ధర్నాలు, ఆందోళనలు చేసినా ఎలాంటి స్పందనలేదన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫిక్స్‌డ్ వేతనం రూ.18 వేలు, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ. 5లక్షలు, చనిపోతే రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా కోశాధికారి జీ.భాస్కర్, జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాల నర్సయ్య, కొంపల్లి భాస్కర్, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలమని, ప్రవీణ చల్లారపు నీరజ, కవిత, భాగ్యలక్ష్మీ, స్వప్న, వరలక్ష్మీ, విజయ, లక్ష్మీ, పద్మ, తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి
కలెక్టరేట్ ఎదుట ధర్నా