● ఏకగ్రీవానికి ఎత్తుకు పైఎత్తులు ● 27న పాలకవర్గ ఎన్నికలు
పటాన్‌చెరువు: పటాన్‌చెరు ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐలా) పాలకవర్గం ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులను స్క్రూట్నీ దశలోనే పోటీ నుంచి తొలగించాలనే కుట్రలు ఓ వైపు, అలా చేస్తే తాము కోర్టుకై నా వెళ్తామని ఆశావహులు మరోవైపు పట్టుదలగా ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల రాజకీయాలు మరింత రసకందాయకంలో పడ్డాయి. ఐలా పాలకవర్గానికి మొత్తం 17 పదవులున్నాయి. చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులతోపాటు ఇతర సభ్య స్థానాలకు పోటీ జరుగనుంది. ఇందుకు నోటిఫికేషన్ ఈ నెల 5న వెలువడింది. ఈ నెల 19కే నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగిసింది. స్క్రూట్నీ అభ్యర్థుల ప్రక్రియ శనివారం నాటికి తేలనుంది. ఇంతలోనే కొందరు వ్యక్తులు చక్రం తిప్పి ఐలా పాలక వర్గాన్ని తమ గుప్పిట్లోనే పెట్టుకోవాలని చేస్తున్న రాజకీయాలపై కొందరు పారిశ్రామికవేత్తలు ముక్కున వేలేసుకుంటున్నారు.
నేడు పేర్లు ఖరారు
శనివారం నాటికి బరిలో నిలిచే వ్యక్తుల పేర్లు ఖరారు కానున్నాయి. ఒక వర్గం తమ అనుచరులు లేదా ప్యానెల్‌కు చెందిన వారే చైర్మన్‌గా ఇతర అన్ని పదవులకు పోటీ చేయాలని ఎన్నికలు ఏకగ్రీవం కావాలని చేస్తున్న ప్రయత్నాలు సాధారణ ఎన్నికల రాజకీయాలకు మించి తలపిస్తున్నాయి. ఇక రెండో వర్గం వారు కూడా కోర్టుల వరకు వెళ్లే పరిస్థితి నెలకొంది. సభ్యత్వాల నమోదు కూడా లోపభూయిష్టంగా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అంటే ఓటర్ల జాబితా తయారీలో కూడా తమకు అనుకూలమైన వ్యక్తుల పేరిట సభ్యత్వాలు ముందుగానే తీసుకున్నారని తెలుస్తోంది. దాదాపు ఇందుకోసం ఓ వర్గం రూ.1.40లక్షలు సొంత సొమ్మును కట్టి సభ్యుల పేరిట సభ్యత్వాల రశీదులను ఈ నెల 13,14 తేదీల్లో తీసుకున్నట్లు తెలుస్తోంది. చైర్మన్ పదవిని ఆశిస్తున్న ఒకరు ఆయనతోపాటు మరికొందరు ఒక కోటరీగా ఏర్పడి సభ్యత్వాల నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. ఒక పారిశ్రామికవేత్త ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఆయనను తప్పించేందుకు ఆయనపై లేనిపోని విమర్శలు చేసి అనర్హుడిగా ప్రకటించాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పటాన్‌చెరు ఐలా చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున రాజకీయాలు ఎప్పుడూ జరగలేదని పారిశ్రామికవేత్తలు చర్చించుకుంటున్నారు.
చైర్మన్ పదవి రేసులో ప్రముఖులు
చైర్మన్ పదవి రేసులో బాసిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి లాంటి ప్రముఖులున్నారు. అయితే అన్ని పదవులకు పోటీ గట్టిగానే ఉంది. ప్రధానంగా అన్ని స్థానాలు ఏకగ్రీవంగా జరగాలని ఒక వర్గం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఐలా పరిధిలో దాదాపు 450 ఇండస్ట్రియల్ ప్లాంట్లు ఉండగా అందులో మొత్తం 379 పారిశ్రామికవేత్తలు తమ పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లు లేదా అర్హులైన సభ్యులు ఉన్నారు.