
మహిళలకు సాగు యంత్రాలు
● లబ్ధిదారుల ఎంపికకు కమిటీలు ● యంత్రాన్నిబట్టి సబ్సిడీ మంజూరు ● నెలాఖరుకు లబ్ధిదారుల ఎంపిక ● జిల్లాకు రూ.కోటి 31 లక్షల కేటాయింపు
సంగారెడ్డి జోన్: వ్యవసాయ రంగంలో మహిళా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణలోభాగంగా మహిళా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు పరికరాలు మంజూరు చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మహిళా రైతులకు యంత్ర పరికరాలు మంజూ రు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ నెలాఖరునాటికి లబ్ధిదారులను ఎంపిక చేసి, అందించే విధంగా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వ్యవసాయ రంగంలో యాంత్రీకరణలో భాగంగా తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా రైతులకు వివిధ రకాల యాంత్రాలను అందజేయనుంది. జిల్లాకు 630 యూనిట్లకు రూ.1,31,17,000లను కేటాయించింది.
లబ్ధిదారుల ఎంపికకు కమిటీలు
వ్యవసాయ శాఖ తరఫున లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు జిల్లా స్థాయిలో జిల్లా కమిటీ, మండల స్థాయిలో మండల కమిటీల ద్వారా ఎంపిక చేయనున్నారు. జిల్లా కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కన్వీనర్‌గా, రీజినల్ మేనేజర్(వ్యవసాయ శాఖ), లీడ్ బ్యాంకు అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. మండలస్థాయి కమిటీలో కన్వీనర్ గా మండల వ్యవసాయ శాఖ అధికారి, సభ్యులుగా ఎంపీడీవో, తహసీల్దార్‌లు ఉండనున్నారు.
లబ్ధిదారుల ఎంపికకు ముమ్మర కసరత్తు
వ్యవసాయ పనిముట్లు అందించేందుకు అర్హులైన వారిని ఈ నెలాఖరునాటికి గుర్తించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నం సాగించారు. జిల్లాలో 630 పరికరాలు సబ్సిడీతో అందించనున్నారు. సుమారు ఏడేళ్ల తర్వాత వ్యవసాయరంగంలో సబ్సిడీపై యంత్ర పరికరాలను పంపిణీ చేయనున్నారు. వివిధ రకాల యంత్రాలను బట్టి సుమారు 50% వరకు అందించనున్నారు.
వివిధ రకాల యంత్ర పరికరాలు
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న యంత్ర పరికరాలు వ్యవసాయ పనులకు దోహదపడే విధంగా అందిస్తారు. అందులోభాగంగా రోటోవేటర్, విత్తనాలు, ఎరువులు వేసే పరికరాలు, కల్టివేటర్లు, డ్రోన్లు, పవర్ స్ప్రేయర్లు, కేజ్ వీలర్లు, రోటోపడ్లర్, పవర్ వీడర్, బ్రష్‌కట్టర్స్, పవర్ టిల్లర్, ట్రాక్టర్, హార్వెస్టింగ్ పరికరాలున్నాయి.