
అల్బెండజోల్.. ఆలస్యమేనా?
● మాత్రల పంపిణీలో జాప్యం ● గత నెల 10న అందించాలని ఏర్పాట్లు ● అనివార్య కారణాలతో నిలుపుదల ● 45 రోజులు దాటినా స్పష్టత కరువు ● జిల్లాలో 4,05,207 మంది పిల్లల గుర్తింపు
పిల్లలపై ప్రభావం..
నులి పురుగులతో పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, బలహీనంగా మారడం, కడుపునొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతోపాటు శారీరక, మానసిక పెరుగుదల తగ్గిపోతుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత తగ్గిపోతుంది. అల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం ద్వారా వీటిని నిర్మూలించవచ్చు. రక్తహీనతను నియంత్రించడమేగాక వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది.
సదాశివపేటరూరల్(సంగారెడ్డి): నులిపురుగుల నివారణకు ప్రతి ఏటా ఒకటి నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్నవారికి అల్బెండజోల్ మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. కానీ, ఈ ఏడాది వీటి పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గత నెల 10న మాత్రలు పంపిణీ చేయాల్సి ఉండగా అవి సరఫరా కాకపోవడంతో పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇప్పటికీ 45రోజులు దాటినా మళ్లీ ఎప్పుడు పంపిణీ చేస్తారనే దానిపై స్పష్టత కరువైంది. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నులిపురుగుల (నట్టల) నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
జిల్లాలో 4లక్షలకు పైగా పిల్లలు
జిల్లాలో 119 ఏళ్లలోపు 4,05,207 పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. వారందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయించాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకు గాను సంబంధించి జిల్లాలోని ఏఎన్‌ఎంలకు, ఆశావర్కర్లకు, వైద్య సిబ్బంది ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహించి మాత్రలు వేసే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు శిక్షణ సైతం ఇచ్చారు.
నాణ్యత లేకపోవడమే కారణమా..!
పిల్లలకు పంపిణీ చేయాల్సిన అల్బెండజోల్ మాత్రలు నాణ్యతగా లేకపోవడమే కారణంగా తెలుస్తోంది. అల్బెండజోల్ మాత్రలు నాణ్యత పరీక్షలో విఫలం కావడంతో ప్రభుత్వం వాటిని వెనక్కి పంపించినట్లు అధికారులు చెబుతున్నారు.
వయస్సును బట్టి మాత్ర..
ఒకటి నుంచి రెండేళ్ల పిల్లలకు సగంమాత్ర స్పూన్ ద్వారా పొడి చేసి నీటిలో వేయాలి. దీనిని మధ్యాహ్న భోజనం తర్వాత వేయాల్సి ఉంటుంది. 2 నుంచి 3 ఏళ్ల పిల్లలకు ఒక పూర్తి మాత్ర పొడిచేసి వేయాలి. 3 నుంచి 19 సంవత్సరాల వారికి చప్పరించి లేదా నమిలి మింగేటట్లు చూడాలి.
అపరిశుభ్రత వల్లే నులి పురుగులు
చేతులు శుభ్రం చేసుకోకుండా ఆహారాన్ని తినడం, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, అపరిశుభ్రమైన పరిసరాల వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. దీనిని నివారించేందుకు షూ ధరించడం, భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ఆహార పదార్థాలపై మూతలు పెట్టాలి. వీధుల్లో విక్రయించే ఆహారాన్ని తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చేతి గోర్లను శుభ్రంగా ఉంచుకోవాలి.
నులి పురుగులతో అనేక అనర్థాలు
నులి పురుగులతో పిల్లలకు అనేక అనర్థాలు కలుగుతాయి. ఇవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవులు. వీటి ద్వారా శరీరంలో రక్తహీనత, పోషకాహారలోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, విరేచనాలు, బరువు తగ్గడంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి.
మాత్రలు సరఫరా కాలేదు
అల్బెండజోల్ మాత్రలు సరఫరా కాకపోవడంతో గత నెల 10న నిర్వహించాల్సిన కార్యక్రమం వాయిదా పడిన మాట వాస్తవమే. జిల్లాకు సుమారు 4.5లక్షల మాత్రలు అవస రం ఉంది. ప్రభుత్వం నుంచి మాత్రలు రాగానే పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
–శశాంక్ దేశ్ పాండే,జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి,సంగారెడ్డి