
వైద్యాధికారి సస్పెన్షన్
● మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు ● కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశం
సంగారెడ్డి జోన్/జహీరాబాద్ టౌన్: విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతోపాటుగా ఆసుపత్రికి వచ్చిన గర్భిణులను ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నట్లు విచారణలో తేలడంతో జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న డా.అజ్మనాజ్‌ను విధులనుంచి కలెక్టర్ వల్లూరు క్రాంతి తొలగించారు. ఈమెతోపాటుగా దౌల్తా బాద్, మల్చల్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఇద్దరు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు అందించాలని జిల్లా వైద్యాధికారి డా.గాయత్రీదేవిని ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం మాతాశిశు సంరక్షణ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు క్రమం తప్పకుండా గర్భిణులను పరిశీలించి వారికి తగిన సూచనలు సలహాలు అందించి, పౌష్టికాహారం, మందులు వాడేలా చర్యలు చేపట్టాలన్నారు. వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, సెంటర్లలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో 2023 –24 సంవత్సరం పోల్చితే 2024–25 సంవత్సరంలో మాతా శిశు మరణాలు 50% తగ్గినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రుల్లోని స్కానింగ్ సెంటర్లను ప్రతీ నెల తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించారు. సక్రమంగా లేని ఆస్పత్రులను సీజ్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా.గాయత్రీదేవి, సీనియర్ జడ్జి రమేశ్, అదనపు ఎస్పీ సంజీవరావు, రెడ్ క్రాస్ చైర్మన్ వనజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సర్వే డబ్బులు చెల్లించాలి: ఎస్‌జీటీ
ఆర్థిక, సామాజిక సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు రావాల్సిన రెమ్యూనరేషన్ ఇంతవరకు చెల్లించలేదని, నిధులు విడుదల చేయాలని ఎస్‌జీటీ నాయకులు కలెక్టర్ కాంత్రిని కోరారు. ఈ మేరకు ఎస్‌జీటీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఆకుల ప్రభాకర్, నిమ్మల కిష్టయ్యలు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.